తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 30 April 2017

బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.



కందము: 
తీరగు "స్ట్రిక్టాఫీసర్" 
'కారు'ను తనప్రక్కనాపి కన్నెర్రలతో 
జేరుచు 'లాఠీ'నెత్తు క  
బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.

Saturday 29 April 2017

కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను. 



తేటగీతి: 
కోట తిరిపాలు తలిదండ్రి కూచి, వీడు 
వీడు వీడని వాడను వీడు, దూర 
దేశమున కొలువున కవకాశమనుచు 
కో.తి. కొక జాబు వచ్చిన గొల్లుమనెను. 

Friday 28 April 2017

అక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - అక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.



కందము: 
అక్కలువమించు సొగసులు
నక్కనులకు గలవటంచు నలుపేయైనన్ 
అక్కజముగ మరదలు సీ 
తక్కను బెండ్లాడె నొక్కడందరు జూడన్.

Thursday 27 April 2017

సామజమును గూల్చె దోమ యొకటి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - సామజమును గూల్చె దోమ యొకటి



ఆటవెలది: 
ఈగ సినిమ జూచి 'ఇన్స్పిరేషను'బొంది 
దోమ సినిమ దీసె దొడ్డ యొకడు 
చివర 'విలను'నేమొ చిత్తుగానదిజంపె 
సామజమును గూల్చె దోమ యొకటి.

Wednesday 26 April 2017

మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్



కందము: 
అల్లన జవ్వని పైటను 
మెల్లగ తా సర్దుకొనుచు మీదకురాగా 
అల్లరిగా మగడిట్లనె 
'మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్.'

Tuesday 25 April 2017

పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్.



కందము: 
బాలాకుమారి 'క్యాట్వాక్' 
మేలుగ నేర్వంగదలచి మేడను గదిలో 
వాలుగ నడవగ పలులో 
పాలను జూడంగ 'పిల్లి' భయపడి పాఱెన్. 

Monday 24 April 2017

గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.


కందము: 
మరి చూడ కూలుడ్రింకులు
సరి పురుగుల జంపుననుచు చక్కగజూపన్
మురిపెమ్మున వదలక నా 
గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్.

Sunday 23 April 2017

తల్లికి మీసములు మొలిచె దండ్రికిలేవే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 09 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల్లికి మీసములు మొలిచె దండ్రికిలేవే. 



కందము: 
అల్లన పుత్రుడు తేగా 
మెల్లగ మందును నెల పరిమితముగ వాడన్
నల్లగ మారెను కురులే 
తల్లికి, మీసములు మొలిచె దండ్రికి, లేవే?

Saturday 22 April 2017

నిద్దుర పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నిద్దుర పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్



ఉత్పలమాల: 
సుద్దులునేర్చి నల్వురును చూడగ గొప్పగ చెప్పనెంచియున్ 
కద్దగు బుద్ధిగల్గి ఘనకార్యము జేయగ లోకమందునన్ 
పెద్దలు జెప్పు బాటలను పేర్మిని సాధన తోడ, వీడుచున్ 
నిద్దుర, పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.

Friday 21 April 2017

శివ, హర, భవ, రుద్ర - తో శ్రీకృష్ణుని స్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




దత్తపది - శివ, హర, భవ, రుద్ర - తో శ్రీకృష్ణుని స్తుతి




తేటగీతి: 
పూర్ణ శశివదనా కృష్ణ! పుణ్య చరిత! 
కనులనే కారు ద్రవముగా కరుణ నీకు
అహరహమ్మును నీకునే నంజలింతు 
విభవమందగ జేయుమా వెన్నదొంగ.  

Thursday 20 April 2017

నీరు చాలక దీపము లారిపోయె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నీరు చాలక దీపము లారిపోయె. 



తేటగీతి: 
మిరపపైరున బెట్టెగా మించి లక్ష 
రైతు కష్టించి పనిజేసె రాత్రి పగలు 
ఎన్ని మందులగొట్టిన నేమి, యెండె 
నీరు చాలక, దీపము లారిపోయె.

Tuesday 18 April 2017

భర్తను బయటకుదరిమె భరత నారి.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భర్తను బయటకుదరిమె భరత నారి.


తేటగీతి:
తల్లిదండ్రులు తోడుగా తమ్ముడొకడు 
వచ్చువేళాయె రైలుకే, తెచ్చుకొరకు
కారు వేసుక బొమ్మని, కదలమనుచు 
భర్తను బయటకుదరిమె భరత నారి.

Monday 17 April 2017

భగణంబున గురువు నాస్తి పండితులారా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భగణంబున గురువు నాస్తి పండితులారా. 



కందము: 
జగము' నగురువే లేదులె 
'ఖగపతి'యన గురువుగనము గణ విభజనలో 
'మగడు' న లేదుగా 'ప్రతి 
భ' గణంబున గురువు నాస్తి పండితులారా. 

Sunday 16 April 2017

కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్.


కందము: 
కుంజర ముఖమును బోలిన 
జింజర్ బిస్కట్లు కొన్ని చేతను బెట్టన్ 
మంజీర నోట కుక్కెను 
కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్.

Saturday 15 April 2017

నవ్య, భవ్య,దివ్య,సవ్య - వైద్యవృత్తిని గురించి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - నవ్య, భవ్య,దివ్య,సవ్య - వైద్యవృత్తిని గురించి



తేటగీతి: 
నవ్య రీతుల శాస్త్రమ్మునభ్యసించి 
దివ్య వైద్యమ్ము తోడను దిగులు తీర్చి
సవ్యముగ జేయు రోగుల సంతసమున 
భవ్య చరితులు పుడమిని వైద్యవరులు. 

Friday 14 April 2017

సమరశూరులు చీమల జంపు వారు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 08 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సమరశూరులు చీమల జంపు వారు.


తేటగీతి: 
లవకుశాఖ్యులారా! నేను లక్ష్మణుడను
హయము విడువుడు కోరనాహవము నిపుడు
కారు సరిజోదులే నాకు, కారు మీరు 
సమరశూరులు, చీమల జంపు వారు.

Thursday 13 April 2017

అసి, కసి, నుసి, రసి....పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - అసి, కసి, నుసి, రసి....పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ 


తేటగీతి: 
అసిత వర్ణంపు భాసిత హసిత వదన 
కనుల కాటుక సిగను మొగలిని ముడిచి 
మేను సిగ్గుల కాంతులన్ మెరయుచుండ 
కదలుచున్నది రసికుల కన్ను చెదర.




Wednesday 12 April 2017

పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ.



కందము: 
వరునిగ వివాహమందున  
సురుచిర దరహాస మునను సుందరి మెడలో 
మరి ముడులు వేయ బట్టిన 
పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ.

Tuesday 11 April 2017

వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్.


కందము: 
అనల్ల మబ్బునేమగు ?
కానగ వామున నదియెది?కడుపున బాధౌ 
నేనేమి తినవలె చెపుమ? 
వాన కురియు, నెండు గడ్డి, వామున్ వేగన్.

Saturday 8 April 2017

పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్.


కందము: 
చిట్టియె మానస వీపును
పట్టుక ఛుక్ ఛుక్కు మనుచు పాడుచు దిరుగన్ 
గట్టిగ తాతయ పొగడెను 
"పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్."

Friday 7 April 2017

గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.


కందము: 
రజకుడు గొనెనొక ఖరమును 
గజమని పేరిడెను, కొంత కాలము పిదపన్
నిజ ఫాల్గుణ మాసమ్మున 
'గజమునకు' ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.

Thursday 6 April 2017

సీతా రామునికిఁ గీడుఁ జేయం దగునే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సీతా రామునికిఁ గీడుఁ జేయం దగునే


కందము: 
నీతియె కాదిక వెడలకు 
ప్రీతిగ రేరాజు నిన్ను పిలువగ "కలువన్"
నీతప్పునిక తెలియుమో
సీ! తారా! మునికిఁ గీడుఁ జేయం దగునే?

Wednesday 5 April 2017

రామా! నిన్నే దల్తుము




శ్రీరామ జయరామ జయజయ రామ 
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. 



Image result for sri rama images














కందము: 
రామా! నిన్నే దల్తుము 
రా! మామదిలోన నిలిపి రాజా రామా!
రా! మాయను తొలగింపుము
రా! మా సీతమ్మతోడ రక్షణ నిడుమా! 

సీసము. 
సూర్యవంశమునందు సూతివైబుట్టినన్ 
చల్లనిదగు చూపు స్వామినీది 
అడవులందున చాల నలయక దిరిగినన్ 
పరమ కోమలమైన పదమునీది 
కోతిమూకలతోడ కోరుచు నుండినన్ 
చంచలమ్మే లేని చనువు నీది 
కోదండ పాణివే మాదండమును గనన్ 
శరణమ్మునిడునట్టి జాలినీది 
ఆటవెలది: 
పానకమ్ము ద్రాగి వడపప్పు నేదిని 
వేడి గాడ్పులందు వేడినాము
చల్లదనము గల్గె చలువపందిళ్ళలో 
చల్లగమము జూడు జానకీశ. 






      

Tuesday 4 April 2017

ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్.


కందము: 
మీరుచు దోమల పాఠము 
నారోజున గురువు చెప్పె నాబడిలోనన్
ఆరాత్రి చంటి కలలో 
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్.

Monday 3 April 2017

లావే యీశ్వల! ములాలి! లక్షించు హలీ!

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - లావే యీశ్వల! ములాలి! లక్షించు హలీ!


రా పలుకని వాని ప్రార్థన.

కందము: 
లావేమీ లామాయన!
లావేమీ క్లుష్ణమూల్తి! లావే వలదా! 
లావే "లా"నిమ్ము దొలా! 
లావే యీశ్వల! ములాలి! లక్షించు హలీ!

Sunday 2 April 2017

కుండ,దండ, బండ, బెండ - గొడుగును గురించి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - కుండ,దండ, బండ, బెండ - గొడుగును గురించి


కందము: 
దండం 'బంబ్రిల్లా'! మా 
కుండగ నీయండ వాన యుండగనెండల్ 
' బెండై ' పోవును, మాకున్
బంగ నాడౌను చేత పట్టెద నిన్నే!

Saturday 1 April 2017

మాంసముదిన విప్రవరుఁడు మాన్యుం డగురా.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 07 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మాంసముదిన విప్రవరుఁడు మాన్యుం డగురా. 



కందము: 
హంసా ! విడుమా నీ మీ 
మాంసను, సలుపగ పరీక్ష మాంసము, పండ్లన్ 
హింసను పెట్టక నిడ, విడి 
మాంసము, దిన విప్రవరుఁడు మాన్యుం డగురా.