తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 30 January 2017

శుక్లాంబరధరం..శ్లోకార్థం పద్యంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణన - శుక్లాంబరధరం..శ్లోకార్థం పద్యంలో 



ఉత్పలమాల: 
తెల్లని వస్త్రముల్ గలిగి తేజముసర్వము వ్యాప్తి జెందుచున్ 
చల్లని వెన్నెలల్ గురియు చక్కని చంద్రుని కాంతి చాయతో 
నల్లన నాల్గు చేతులును యచ్చపు శాంతపు మోము వానినే 
యుల్లమునందునన్ నిలిపి యుంచుదు విఘ్నములన్ని పోవగన్. 

Sunday 29 January 2017

నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.



ఉత్పలమాల: 
పోవుచునుంటి నేగుడికి ప్రొద్దది గ్రుంకుచునుండె, నుండెగా 
చేవగ గర్కిపాటినర 'సింహపు' టయ్యవధానమిత్తరిన్ 
కావలెనన్న పద్యసుధ, కార్యములన్నియు నెట్టి ప్రక్కకున్ 
నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.

Saturday 28 January 2017

పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.



కందము: 
పాపమ్ములు, పుణ్యమ్ములు 
తాపము కోపమ్ములిలను తగ మిళితమగున్ 
ఆ పగిదిని కలిసుందురు 
పాపాత్ములు, భ్రష్టులు, జనవంద్యులు జగతిన్.

Friday 27 January 2017

నీమూతి మూతినుంచుచు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - నీమూతి మూతినుంచుచు









కందము: 
నీమూతి మూతినుంచుచు 
సామూహిక చుంబనముల స 'రసము' గ్రోలన్  
ఏమీ తప్పనిపించద
దేమో నీ " గ్యాసు " మహిమ తీయని సోడా ! 

సీసము: 
నీటిలోనను కొంత నిమ్మరసము జేర్చి 
నింపుకొనుచు "గ్యాసు" నిక్కముగను 
బండిలో నెక్కుచు బరబరా దిరుగుచు
గొంతు దడుపుగద గోలి సోడ 
విందు భోజనము పసందుగా నెక్కించ 
కడుపు నుబ్బరమును కడిగి వేయు 
మండుటెండనుబడి మసలెడు కూలీల
దప్పికి చల్లని దారిజూపు 

ఆటవెలది: 
దాని " కేక " వినగ వీనుల విందౌను 
సోకు దాని రూపు సొగసుమీరు 
మీరు ద్రావుడయ్య మిన్నగా రుచిజూడ 
సీసమిదియె " సోడ సీస " కిడుదు. 

కందము: 
సోలిన వారికి ప్రీతిగ 
గ్రోలిన నుత్సాహమిచ్చు గోలీ సోడా ! 
ప్రేలెడు గూండా చేతను 
ప్రేలగ నగుపడకు మమ్మ పెడుదు నమస్సుల్. 

Thursday 26 January 2017

నోట్లోన వ్రేలు ముంచకు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - నోట్లోన వ్రేలు ముంచకు  











కందము: 
నోట్లోన వ్రేలు ముంచకు  
నోట్లను లెక్కించు వేళ నో మానవుడా 
కోట్లాది సూక్ష్మ జీవుల
కట్లే వాసమ్ము రోగ కారకములుగా ! 

Wednesday 25 January 2017

కోమటింటఁ దెగెను కుక్కుటములు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కోమటింటఁ దెగెను కుక్కుటములు 



ఆటవెలది: 
కోమటీడు తాను కోరి కిరాయికి 
రెడ్డికద్దెకిచ్చె రెండు గదులు 
ఆదివారమందు నలవాటుగానట 
కోమటింటఁ దెగెను కుక్కుటములు. 

Tuesday 24 January 2017

చేపల మ్రుగ్గు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - చేపల మ్రుగ్గు 









కందము: 
చేపల కన్నుల చిన్నది 
చేపల చిన్నదియు పెద్ద చేపల, వరుసన్
చేపట్టి మ్రుగ్గు బెట్టెను
చేపట్టిన వాడు మెచ్చి చిటికెలు వేయన్. 


ఆటవెలది: 
చేపతోకచేప చేపతోకాచేప 
చేపతోక చేప చేపతోక 
తోక చేప తోక తోకచేపా చేప 
తోక చేపతోక తోక చేప. 

Monday 23 January 2017

ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.



ఉత్పలమాల: 
ఆపదలందు వేడుకొన నన్నియు వేళల నండదండగా 
నాదుకొనంగ భక్తులకు నందరికేపతి యయ్యె శ్రీశుడే 
పేదకుచేలు, నా మకరి పీడను తీర్చగ నాకరీంద్రుకున్ 
ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

Sunday 22 January 2017

అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్.



ఉత్పలమాల: 
బంగరుబాబు తోడనొక పందెమువేసెను బద్రి, చెప్పుమా 
సంగతమింతగాని యొక చక్కని మాటను, చెప్పలేనిచో 
చెంగును గప్పి మోమునకు చెప్పకబొమ్మన , చెప్పెనిట్టులన్ 
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్.

Saturday 21 January 2017

పురుషుని నిందించు సతినిఁ బూజింతురిలన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పురుషుని నిందించు సతినిఁ బూజింతురిలన్.



కందము: 
ధరలో పరీక్ష జేయగ 
హరభక్తుల బాధలగని యమ్మగ కరుణన్ 
త్వరత్వరగాబ్రోవగ తన 
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.

Friday 20 January 2017

గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య- గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్. 



కందము: 
బండ్రెడ్డి " కబడిలో " ను 
ద్దండ్రాయుడు నెట్టివేయ దబ్బున పడగా 
గుండ్రముగ తిరిగె, తగిలె 
గుండ్రాతికినోరు - వచ్చి గొల్లున నేడ్చెన్. 

Thursday 19 January 2017

తెలుఁ గదేల? నీకుఁ దెలుఁగు బిడ్డ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తెలుఁ గదేల? నీకుఁ దెలుఁగు బిడ్డ. 



ఆటవెలది: 
అక్షరములు కొన్ని యనవసరమ్మని 
"బరువ"టంచు విడువ పలుకుటెట్లు  
తెలివిలేక నీకు "తేలిక"గా మారె
తెలుఁ గదేల ? నీకుఁ దెలుఁగు బిడ్డ. 

Wednesday 18 January 2017

ఆవు - మేక - కుక్క - పిల్లి .... భారతార్థంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - ఆవు - మేక - కుక్క - పిల్లి .... భారతార్థంలో. 


తేటగీతి: 
తల్లికొకకాంతయే దురపిల్లి జెప్ప
నేగె భీముండు తినుచు మమేకమగుచు 
నావురావురుమనెడు బకాసురునట 
పేనువోలెను కుక్కగా కోనలోన.   

Tuesday 17 January 2017

చేతులారంగ శివుని ...పద్య భావం ... వృత్తంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - చేతులారంగ శివుని ...పద్య భావం  ఏదైనా వృత్తంలో.     


ఉత్పలమాల: 
చేతల భక్తినేగలిగి చేతులతో శివ పూజ సేయకన్  
ప్రీతిగ కీర్తనల్ గొలుచు రీతిని విష్ణుని పిల్వకుండినన్ 
భూతములన్నిటన్ దయయు బూనుచు సత్యము దల్పకుండినన్
భూతలమందు నీనరుగ బుట్టిననేమిఫలమ్ము మానవా ! 

Monday 16 January 2017

కాఫీ పద్యాలు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కాఫీ పద్యాలు  









కందము: 
మరిగిన నీటను పొడితో 
మరిజేర్చుచు శర్కర, తగు మాత్రము పాలన్ 
నురగలు గ్రక్కెడు కాఫీ 
మరిగిన వాడెట్లు మారు, మరిమరి త్రాగున్.

కందము: 
కాఫీ త్రాగినగానీ 
'సాఫీ' గా పనులుగావు సరి యుదయమునన్ 
మాఫీ యగు తలనొప్పులు 
కాఫీనే యతిథి కిడక కదలడు గనుమా !



కందము: 
కాఫీ త్రాగుటకెందుల 
కా ఫీలింగ్, త్రాగు రెండు కప్పులు, నీకే
"కాఫీ" దేతా హూ నీ
కా ఫీడింగ్ చాలకున్న, క్యా!బోలో జీ ! 

హిందీలో " కాఫీ " అంటే వలసినంత అని అర్థం....

కందము: 
నా కాఫీస్ టైమైనది 
నీకా ఫిల్టరును వాడ నిజముగ రాదే !
ఓ కాఫి విడిగ పెట్టుము
నాకా ఫీలింగులేదు నమ్మవె సఖియా ! 

Sunday 15 January 2017

హృద్రోగమె మేలు సేయు నెల్లజనులకున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హృద్రోగమె మేలు సేయు నెల్లజనులకున్.


కందము: 
భద్రముగా యోగాసన
ముద్రలనే నేర్చి విష్ణు మూర్తిని మదిలో 
చిద్రూపు దలప - రాదుగ 
హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.

కందము: 
భద్రముగా యోగాసన
ముద్రలనే నేర్చి జేయు ముపపథ్యమునే 
ఛిద్రము గాదుగ, రాదుగ 
హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.

Saturday 14 January 2017

నింగినున్నట్టి చుక్కలే నేలబడగ

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  











తేటగీతి: 
నింగినున్నట్టి చుక్కలే నేలబడగ  
మెరుపుతీగెలు వాటినే మేలు గలుప 
రంగులేడుగ  జల్లగా రవికిరణము
వెలిగె 'సంక్రాంతి ముగ్గులై' తెలుగు నేల. 
    

Friday 13 January 2017

ముచ్చటందుచు రేగును ముఖపు కాంతి.

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. 















కందము: 
వెదకుచు నింటను చెత్తను 
కుదురుగ జనమంతజేరి కూరిచి వేయన్ 
ఉదయమున భోగిమంటల
పదిలముగా సుఖములందు పరిశుభ్రతతో.     
   

తేటగీతి: 
చిన్న పిల్లల గూర్చుండజేసి వారి  
రేగియున్నట్టి తలలపై భోగినాడు. 
రెచ్చి పెద్దలు వోయగా రేగుపండ్లు
ముచ్చటందుచు రేగును ముఖపు కాంతి.  

Thursday 12 January 2017

కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట



తేటగీతి: 
మొద్దునిద్దురనందున " పెద్దవాడు "
ఉన్నదిచ్చెడి గుణమున " చిన్నవాడు " 
మేటి యిద్దరు, చూడగా నాటలందు 
కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట. 

Saturday 7 January 2017

సిరిగలవానికి జెల్లును .పద్యార్థం మరొక ఛందంలో.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - సిరిగలవానికి జెల్లును .పద్యార్థం   మరొక ఛందంలో. 



ఆటవెలది: 
శ్రీపతికిని జెల్లు శ్రీమతుల్ పదునారు 
వేలమంది, యేన్గు తోలుగట్టు
నాదిభిక్షువ! కన నాలులిద్దర? విడు 
మాకు గంగ, గిరిజ నీకు చాలు. 

Friday 6 January 2017

భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.



ఉత్పలమాల: 
ఆర్యులు కొంతమంది యొక యాగముజేయుచు నుండి రచ్చటన్ 
కార్యములోన ఋత్వికుడు బ్రహ్మకు తోడుగ నాలువచ్చె, నా
చార్యులు కొంతమంది ఘన సంస్కృతమందున మాటలాడగా 
భార్యకు భాషరాదనుచు బల్కెను 'బ్రహ్మ' సభాముఖమ్ముగన్. 

Thursday 5 January 2017

బొంగరము


శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - బొంగరము 







కందము: 
గిరివలె  నున్నది కన గిం
గిరములు తా దిరుగుచుండె కేలున, నా బొం
గరమే చూడుడు బాలకు
గరమున్ గిలిగింత లిడగ, గలగల నవ్వెన్.

Wednesday 4 January 2017

హరిని హరి హరించె హరి కనంగ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హరిని హరి హరించె హరి కనంగ.



ఆటవెలది: 
హరియనగను కప్ప మరియొక్క టర్థము 
హరికి పాము నగును సరి మరొకటి 
హరియనంగ కోతి యా వరుసను విను 
హరిని హరి హరించె హరి కనంగ.


Tuesday 3 January 2017

కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ


కందము: 
సుందరి బొట్టును కాటుక 
నందముగా తీర్చి జేర నతి లలితముగా 
ముందర, పతి చేతల కర 
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ. 

Monday 2 January 2017

సవ్యసాచి సఖుడు సైంధవునకు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సవ్యసాచి సఖుడు సైంధవునకు. 



ఆటవెలది: 
కొడుకు మడియ నరుడు కోపించి హరి ముందు 
ప్రతినజేయ " బావ ! బాగు " యనుచు 
మరణ శాసనమ్ము మదిలోన లిఖియించె 
సవ్యసాచిసఖుడు, సైంధవునకు.

Sunday 1 January 2017

ఆంగ్ల వత్సరమున 'కందమైన ' శుభాకాంక్షలు.

అందరికీ 2017వ  నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 

కందము: 
గ్రీటింగ్స్ టూ ఆల్ ఆఫ్ యూ 
ఛీటింగ్స్ మేనాట్బి రీచ్ యు సేవ్స్ దీ లార్డ్ గాడ్ 
స్వీటెక్స్పీర్యన్స్ అండ్ విష్
లైటిందా ఫ్యూచరింది లౌలీ న్యూయ్యర్.