తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 31 October 2016

ఈగ పడిన పాలు హిత మొసంగు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఈగ పడిన పాలు హిత మొసంగు.



ఆటవెలది:
చెత్త, కుళ్ళు పైన చేరిదిరిగి వచ్చి
నీదు పాల లోన నీదులాడె
నేమికాదటంచు నెత్తి త్రాగకుమయ్య 
ఈగ పడిన పాలు, హిత మొసంగు.



Sunday 30 October 2016

నిజము దీపాల పండుగౌ ప్రజకు నాడు.


















సీసము:
ధరలు ధరను వీడి 'తార జువ్వ'ల వోలె
            పైకెగయక కనబడిన నాడు 
భుగభుగ మంటలన్ 'భూచక్రము'గ గాక 
        చల్లబడుచు భూమి సాగు నాడు
మారణ హోమాల మానవ 'బాంబు'లే    
    మహిని పేలక శాంతి మసలు నాడు 
సరిహద్దు దేశమ్ము  సరి 'చిచ్చు' బుడ్డులే  
           మండించకుండగా నుండు నాడు

తేటగీతి:
స్త్రీల, బాలల బట్టుక జెరచు ఖలుల 
'విష్ణుచక్రమ్ము' ఖండించి వెలుగునాడు 
నిండు వెలుగులు భువిపైన మెండుగాను 
నిజము దీపాల పండుగౌ ప్రజకు నాడు. 

          

Saturday 29 October 2016

జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.


కందము: 
కొరివి పిశాచము పట్టెను 
చురుకుగ వదిలింతునేను చూడుండనుచున్ 
మరివీపుననే మోదగ 
జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

Friday 28 October 2016

తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు.



తేటగీతి: 
కన్నవాడును, పెంచిన ఘనుడు, తనకు 
నొడుగు జేసిన వాడును, యొజ్జ,కన్య
నిచ్చి పెండిలి జేసిన హితుడు, కలిపి
తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు.

Thursday 27 October 2016

బ్రాహ్మణుండు కాకి పలలముదిను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బ్రాహ్మణుండు కాకి పలలముదిను.



ఆటవెలది: 
గోవు మెచ్చి తినును కోమలమౌ గడ్డి 
చేరి దుంపలతిను చెవుల పిల్లి 
పప్పు ధప్పళమ్ము బహుపసందుగ తిను
బ్రాహ్మణుండు, కాకి పలలముదిను.

Wednesday 26 October 2016

శక్తులు వనితల్

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - శక్తులు వనితల్









కందము: 
చక్రము విప్పుటనందును 
చక్రమునే తిప్పుటందు చకచక పనులన్
వక్రముగ మారకుండగ 
సక్రమముగ జేయుటందు శక్తులు వనితల్.

Tuesday 25 October 2016

పడక సీను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - పడక సీను. 







శ్రీ కృష్ణుడు దుర్యోధనునితో...

కందము: 
నిద్దురనిపుడే లేచితి 
నిద్దర నే జూచినాడ నిట నరు దొలుతన్ 
ముద్దుల బావ ! సుయోధన 
కద్దగు సాయమ్ము ముందు కవ్వడి కోన్.

Monday 24 October 2016

రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము. 


తేటగీతి: 
తనదు రక్తము నీయంగ తగని దగచు
నంటు రోగము తగిలించు ననుచు దెలిసి 
యుండి గూడను " శాడిస్టు " మొండి యగుచు 
రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము

Sunday 23 October 2016

పైకి పోవటమే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పైకి పోవటమే 










కందము: 
ముందుకు సరిగా  సాగిన 
నందరు క్షేమముగ పైకి జేరుట జరుగున్
క్రిందకు లోయన జారిన 
నందరు నిక్కముగ " పైకి " జేరుట జరుగున్.

Friday 21 October 2016

కుక్కకుమీ కుక్కుటముల

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కుక్కకుమీ కుక్కుటముల 











కందము: 
కుక్కకు  మీ కుక్కుటముల 
దక్కకనే జూడునట్లు దాచుడు గంపన్ 
కుక్కకుమీ పదినిరువది
చక్కగ నైదారునుంచ సంతోషమ్మౌ. 

Thursday 20 October 2016

రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్.



కందము: 
సహవిద్యార్థియు రాముడు
హహహాయని " కర " ముతోడ నట " పుష్ " జేయన్
రహదారి ప్రక్క వాగున
రహమాన్ చేసెనట "పుష్కర " స్నానమ్మున్.

Wednesday 19 October 2016

తోకలేనిపిట్ట

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - తోకలేనిపిట్ట 






కందము: 
ఎర్రని పెట్టెను వేసిన 
తుర్రున నడ్రస్ కు జేరు తోకయె లేకన్ 
జర్రూరు పిట్ట, కలిగెను 
వర్రీ ! సెల్ దెబ్బ కిపుడు బ్యాకై పోయెన్.

Tuesday 18 October 2016

అరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము. 



తేటగీతి: 
సరకు జేయడు నామాట చంటి గాడు 
వాదు లాడును తానిట్లు పందెమిడుచు 
హైదరాబాదు ప్రక్క సింహాచలమ్ము 
అరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము. 

Monday 17 October 2016

సారా గొనె శివుడు లోకసంరక్షణకై.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సారా గొనె శివుడు లోకసంరక్షణకై.



కందము: 
చేరుచు జిలుకగ సంద్రము 
మీరుచును హలాహలమట మీదకు రాగా
ఘోరము నాపగ తన మన 
సారా గొనె శివుడు లోకసంరక్షణకై.

కందము: 
సారా యనగా మొత్తము 
పారావారమ్ము జిలుక వచ్చిన విషమున్ 
చేరుచు నింత మిగల్చక 
"సారా" గొనె శివుడు లోకసంరక్షణకై. 

Sunday 16 October 2016

పోకలు

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పోకలు  `







కందము: 
పోకలనిచ్చట జూడుడు 
పోకుడు మరి వాని వదలి పుక్కిట నిడుచున్ 
ఆకుల సున్నము బూసుక 
చేకొనుచును నోట నమల చిక్కగ పండున్.

Saturday 15 October 2016

హైదరాబాదులోన నౌకాశ్రయంబు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హైదరాబాదులోన నౌకాశ్రయంబు.


తేటగీతి: 
ఆంధ్ర దేశపు పటమున నైదు పేర్లు 
గుర్తు బెట్టగ జెప్పె మా గురువు గారు 
నదులు గోదావరీ కృష్ణ, నల్లమలయు 
హైదరాబాదు, లోన నౌకాశ్రయంబు.

Friday 14 October 2016

కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.

 శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.



కందము: 
కమలా ఫలములు దెచ్చితి 
ని, మరచినానయ్యొ " ఫ్రిడ్జు " నెంచుక బెట్టన్ 
యమ యెండలు గాయుటచే 
కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.

Thursday 13 October 2016

తిరుపతి వేంకట కవులు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - తిరుపతి వేంకట కవులు. 








కందము: 
రోసము గల కవి వీరులు
వేసము గనుడిటు తిరుపతి వేంకట కవులన్ 
మీసము తెలుగాంధ్రమ్ముల
మా సములన్ జూప తీతు మనిజెప్పిరిగా! 

Wednesday 12 October 2016

పచ్చ అరటి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పచ్చ అరటి   







ఆటవెలది: 
పేదవారి కైన పెద్దవారలకైన 
పండు ముసలికైన పాపకైన
భోగి రోగికైన భువిని పూజలకైన 
పనికి వచ్చు ఫలము పచ్చ యరటి.

Tuesday 11 October 2016

అమ్మాయను మాయజేతువమ్మా


వీక్షకులందరికీ  దసరా శుభాకాంక్షలు.

శ్రీ దుర్గాయైనమః



Image result for mahishasura mardini images




కందము: 
అమ్మాయను మా పిలుపున
కమ్మాయను మాయజేతువమ్మా! మము చే      
కొమ్మా! నీదరి,శంభుని  
కొమ్మా! యిమ్మహి జనులకు కోరినవిమ్మా! 

Monday 10 October 2016

భారమనిరి తాళి భార్య లెల్ల.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భారమనిరి తాళి భార్య లెల్ల. 



ఆటవెలది: 
మెడను పసుపుకొమ్ము మేలుగా ధరియించి  
తీర్చుడనుచు ఋణము తీరుగాను
పతులకిచ్చినారు, బంగారమేయుండ 
భారమనిరి తాళి భార్య లెల్ల. 

Sunday 9 October 2016

పా (గో)పయ్య గోపెమ్మ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పా (గో)పయ్య గోపెమ్మ. 










కందము: 
పాపయ్య బొమ్మ జూడుడు
గోపయ్యే వెనుకనుండ, కోమలి గనుచున్ 
దీపమునే వెలిగించుచు
నాపకుమా కృష్ణ వేణు నాదమ్మనియెన్.

(ఇది ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గీసిన చిత్రము)

Saturday 8 October 2016

కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు.


తేటగీతి:  
వెలుగులెంతయొ నిండిన వేదిపైన 
కురుచ దుస్తులు ధరియించి యోరకంట 
కలయ జూచుచు జేసెడి "క్యాటువాకు"
కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు. 

Friday 7 October 2016

బట్ట బయలాయె గదా !

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - బట్ట బయలాయె గదా ! 







కందము: 
భరత మున బుట్టి నాడుర 
భరతమునే బట్టినాడు పసితనమందే 
భరతుడు సింగమ్ముల, నిట 
భరతుని గనగాను " బట్ట బయలాయె " గదా! 

Thursday 6 October 2016

సైంధవ వధ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - సైంధవ వధ. 







కందము: 
తలకొరివి బెట్టు వానికి 
తలపెట్టగ వాడు కీడు ధరణిని బడగా 
తలదీసె నరుడు సైంధవు 
తలపించగ రాహువు, హరి దయతో నపుడే !

Wednesday 5 October 2016

కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!


కందము: 
చేకొని జంతుల బొమ్మలు
రాకేశూ!చెప్పివేమి? రారా ! యనగా 
ఓకె ! యని జెప్పె బాలుడు
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ! 

Tuesday 4 October 2016

చీరేశారు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - చీరేశారు.










కందము: 
ఉదయమున చీరెగొనుటకు 
ముదితలు పదిమంది రాగ మూటలు విప్పన్ 
వదలక రాతిరి వరకును 
వెదకిరి " ఓల్డ్ మోడ " లనుచు వెడలిరి, హయ్యో !

Monday 3 October 2016

శివ - హర - భవ - రుద్ర .... విష్ణు స్తుతి

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - శివ - హర - భవ - రుద్ర ....  విష్ణువును స్తుతిస్తూ


తేటగీతి: 
శివము గలిగించు చక్రినే చేరి గొల్వ 
నీరు ద్రవియించు కన్నులన్ నియతి భక్తి 
నార్తి నేవేడెద నహరహమ్ము వాని 
పారిపోవంగ భవబంధ పాపచయము.

Sunday 2 October 2016

వ్యాస పీఠం

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - వ్యాస పీఠం   











కందము: 
వ్యాసుని భారతమును మరి 
వాసిగ పోతన్న వ్రాత భాగవతమ్మున్ 
ధ్యాసగ రామాయణమున్  
మోసిన మా వ్యాసపీఠ మునకిడుదు నతుల్.

Saturday 1 October 2016

మెరుపుల 'హాయ్'

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - మెరుపుల 'హాయ్' 








కందము: 
ధర తాపము తొలగగ తొల
కరి వానలు కురియ మేను కందగ సుఖమే 
మురియుచు నవ్వగ మన్నే 
మెరుపులతో " హాయి " జెప్పె మిన్నే కనుమా!