తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 30 May 2016

పాప - బాల - పిల్ల - పోరి,... భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది - పాప - బాల - పిల్ల - పోరి,... భారతార్థంలో



కృష్ణుడు సంధి రాయబారంలో....

కందము: 
పోరిన గెల్వగ లేరులె 
మీరిన కాలమ్ము, పాపమింతయు దలచన్
కౌరవ! దురపిల్లగవలె
కోరినబా లసలునిడక కోరకు గొడవన్.  

Sunday 29 May 2016

పసిబాలుని పెండ్లియాడెఁ బడతి ముదమునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పసిబాలుని పెండ్లియాడెఁ బడతి ముదమునన్



కందము: 
పసివాని గనిన యక్కయె 
ముసిరిన రోగాన మరణ మొందగ, బావన్ 
కసరక నే పెంచగ నా 
పసిబాలుని, పెండ్లి యాడెఁ బడతి ముదమునన్


Saturday 28 May 2016

ఏనుగు లౌ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఏనుగు లౌ  








కందము: 
ఏను గురుతెరిగితిని గన
నేనుగు ప్రేమించెనొక్క నేనుగు నటుపై 
కానుకగ పూలగుత్తిని 
పూనిక తొండమ్ముతోడ పొగడుచు నిచ్చెన్. 

Friday 27 May 2016

దేవులాటలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - దేవులాటలు 









తేటగీతి: 
నామము జదువు, పెట్టకు నామమయ్యొ 
పూలు జల్లుము విడువుము పాల ధ్యాస 
దేవులాటలు వదలుము దేవునికడ 
నీసడింపులు మానుమ, ఈ శు దరిని. 

Thursday 26 May 2016

సాని పొందు మోక్ష సాధకమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సాని పొందు మోక్ష సాధకమ్ము. 



ఆటవెలది: 
వృత్తియందు గలిగి వెగటును, దానిని
మానివైచి వేడి మాన్య వరుల 
హరిని జేరు విధము నడిగిన యార్తితో 
సాని పొందు, మోక్ష సాధకమ్ము

Wednesday 25 May 2016

చీమ - దోమ - నల్లి - పేను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది - చీమ - దోమ - నల్లి - పేను, గోపికావస్త్రాపహరణం  గురించి



తేటగీతి: 
మేను పై భ్రాంతి మీలోన పేనుకొనెను 
దాని నేనిదో మనసార దాచినాను 
ప్రేమనల్లిన మీమది పిలువ నన్ను 
చీమ మాత్రపు చిక్కులు చేరనీను.

Tuesday 24 May 2016

మాట,మలుపు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - మాట,మలుపు 









తేటగీతి: 
మాటనిచ్చిన తండ్రియే మలిగిపోయె
మాటనడిగిన తల్లియే మచ్చబొందె 
మాట నిలిపిన పుత్రుడే మాన్యుడయ్యె 
మలుపు తిరిగెను రాముని మహిత గతులు.

Monday 23 May 2016

మయసభలో దుర్యోధనుఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి  - మయసభలో దుర్యోధనుఁడు.
నాలుగు పాదాలలో ప్రాసాక్షరాలుగా వరుసగా ‘ద - ది - దు - దె’ ఉండాలి.


చంపకమాల: 
కదలనిబొమ్మలున్ కదలు కాగనయ్యెను చిత్రచిత్రముల్ 
ఇది గన నాకులేదు మదినెట్టులనోపుదు వీరివృద్ధినిన్ 
ముదురగ పట్టలేము మరి ముందరె వేటును వేయగావలెన్
అదెగద చక్కనౌ కొలను హాయిని బొందెద విశ్రమించెదన్.

Sunday 22 May 2016

పసుపు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - పసుపు  









కందము: 
ఇంటికి గడపల మీదకు 
వంటికి కళనీయ గోరు వనితలకైనన్
వంటకు, నౌషధములకును 
కంటిరె మన పసుపు మేలు  గణపతికైనన్

Saturday 21 May 2016

దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


నిషిద్ధాక్షరి - దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.   



తేటగీతి:  
సప్త గిరులను నిలచిన శక్తివి గద 
హరిగ హరునిగ తలపుల గురి కుదిర్చి 
కురులనిచ్చిన దరగని సిరులనిచ్చి
భక్త జనులను రక్షించు పరమ పురుష. 

Friday 20 May 2016

కుమ్మరి సారె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కుమ్మరి సారె 









కందము: 
మన్నును కుండల జేయుచు 
మన్నగనే జేసి యమ్మి మనుగడ కొరకై 
మన్ననలను బొందునుగద
అన్నా కుమ్మరికి సారె హరి చక్రమ్మే. 

Thursday 19 May 2016

కలమున్ గని కవివరుండు కలవరమందెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కలమున్ గని కవివరుండు కలవరమందెన్.



కందము: 
'అల వైకుంఠము' పద్యము
నిల వ్రాయగ పోతనయపు డిటునటు తలపన్
తలపకనే హరి వ్రాసిన
కలమున్ గని కవివరుండు కల "వర" మందెన్.

Wednesday 18 May 2016

అల్లా ... ఆరాం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - అల్లా ... ఆరాం 










ఆటవెలది: 
అహ్మదప్పుడాగి ఆ "రాం" సె బైఠనె
శాస్త్రి ' లిఫ్టు ' నడుగ శహరు నందు 
చల్లగుండు మనుచు "అల్లా " నె యని యెక్కె 
మనసు కలిసినపుడు మతములడ్డ ? 

Tuesday 17 May 2016

ఆలము - కాలము - జాలము - వాలము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




దత్తపది: ఆలము - కాలము - జాలము - వాలము... రామాయణార్థంలో 




కందము: 
ఆలమునన్ రావణ సుతు 
జాలముతో లక్ష్మణుండు సరిమూర్ఛిల్లన్ 
వాలము చరచుచు హనుమ స 
కాలములో నౌషధముల కైగిరి దెచ్చెన్.  

Monday 16 May 2016

పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.



కందము: 
రాదారి మీద జోరుగ 
మోదమ్మున సాగుచున్న మోటరు కారున్ 
లోదరి బుడుగిట్లనియెను 
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.

Sunday 15 May 2016

శ,ష,స వాడకుండా శిశుపాల వధ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


నిషిద్ధాక్షరి - శ,ష,స వాడకుండా  శిశుపాల వధ. 


శ్రీకృష్ణ ఉవాచ...

కందము: 
అత్తయె కోరగ నిచ్చితి 
నత్తరి నే నొక వరమ్ము, నది దాటెనుగా 
ఇత్తరి తప్పుల బావకు 
కుత్తుక నేనుత్తరింతు కోపము హెచ్చెన్.

Saturday 14 May 2016

తల లేని వాడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - తల లేని వాడు









కందము: 
తల లేని వాడు, పలు కవి
తలనే తా వ్రాయు వాడు తప్పదు తల్లీ 
తలనొప్పియె! సర్దుకొనుము  
తల మనకే లేదననుచు తాననుకొనుగా !

Friday 13 May 2016

మామ, అత్త, బావ, వదిన ... భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.





దత్తపది - మామ, అత్త, బావ, వదిన ... భారతార్థంలో


దుర్యోధనుని  మనోగతం...

తేటగీతి:
మా మనస్సునమెదలెను మయుని సభయె
మరువ దినమందు రాత్రియు మానినచట
నత్తరినిగేలి జేసిన నాటి ఘటన
ఏమి చేతునబ్బా వగ  లేమి గాగ.

Thursday 12 May 2016

కన్నప్పగించిన కన్నప్ప

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కన్నప్పగించిన కన్నప్ప 










కందము: 
కన్నప్పగించి చూడక 
కన్నప్పుడు రక్తమోడు కాలుని గనుచున్ 
తిన్నడు కాలును గుర్తుగ 
కన్నప్పుడు బెట్టి 'నాడు' కన్నప్పాయెన్. 


Wednesday 11 May 2016

అమ్మవే !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - అమ్మవే ! 









కందము: 
అమ్మగ వెలిగిననీవే 
అమ్మగ నీ పొత్తములనె యరుదెంచితివా ! 
ఇమ్ముగ నినుజూచుటకై 
ఇమ్మహిలో నెవరులేర, యిది దారుణమే !



కందము: 
ఎవ్వారు నిన్ను జూడగ 
నవ్వా దరిజేర్చలేద, ఆకటి కొరకై  
అవ్వవ్వా ! పొత్తములను 
నవ్వుచునే యమ్ముచున్న నారీ ! జే ! జే !

Tuesday 10 May 2016

శీతాఫలము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - శీతాఫలము. 








కందము: 
శీతాకాలమ్మందున 
శీతాఫలమందివచ్చు చేతికి మనకే 
ప్రీతిగ తినుడీ దీనిని 
మీతోడుత నున్నవార్కి మెచ్చగ నిడుడీ.


కందము: 
పచ్చని రూపము, పైనను 
గిచ్చిన విధముండు లోన గింజలు నలుపే 
మెచ్చెడు గుజ్జే తెలుపుగ 
వచ్చెను శీతాఫలమ్ము బాగుగ తినుడీ. 

Monday 9 May 2016

శవము - పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది: శవము - పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన.  



కందము: 
త్రుంచితి కోసిన 'కేకును'
పంచితి కేశవ మురారి ప్రణవాదులకున్ 
దంచుచును పాడె బృందము 
మంచిగ చెలికాడు జెప్ప మరిమరి 'విష్షెస్.' 

Sunday 8 May 2016

పుల్లైసు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పుల్లైసు 








కందము: 
ఇల్లిదె పాలను చక్కెర 
మెల్లగ మరికొంత జేర్చి మెచ్చెడు రంగున్ 
జల్లుచు ఫ్రీజింగ్ జేసిన 
పుల్లను మరి గ్రుచ్చనైసు ఫ్రూటగు గదరా ! 

కందము: 
పిల్లలకిష్టము తినగా 
మెల్లగ మరి పెద్దవారు మెచ్చుచు దినుగా 
చల్లని ఐస్ ఫ్రూట్ నోటను 
పుల్లను చేబట్టి చీక పులకింతలెగా !

Saturday 7 May 2016

గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో.



కందము: 
వేడుచు తలిదండ్రులనే
'స్పీడుగ' నే తిరుగలేను శిఖి వాహనుతోన్
'ఐడియ ' నిమ్మని - " వినరా
గాడిద" ! పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో !

Friday 6 May 2016

కాండముపై తొండపుదొర

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కాండముపై తొండపుదొర 








కందము: 
ఆకులతో పూజలుగొను 
నాకరిముఖ దేవుడిటుల నాకుల మధ్యన్
శ్రీకరముగ కాండముపై
ప్రాకటముగ నిలచినాడు, భళిభళి యనగా !

Thursday 5 May 2016

న్యస్తాక్షరి - రా-మా-రా-వు,

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి - రా-మా-రా-వు,  ప్రతి పాదానికి మొదటి  అక్షరం 


తేటగీతి: 
రామ కృష్ణుల రూపమ్ము రావణుండు 
మాకు నచ్చె సుయోధన మహిత నటన 
రారు నీబోటి నటు 'లెంటిరాముడ ' పద 
వులును గోరక నినుజేరె పుణ్యమూర్తి.

Wednesday 4 May 2016

ర్యాట్ హెల్మెట్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ర్యాట్ హెల్మెట్ 


 





కందము:  
తలపెట్టెను ముక్కనుదిన 
తల 'ఫట్టున' బోనున బడు తలపే గలుగన్ 
తలబెట్టెను 'హెల్మెట్టే'
తల బట్టుకు నెలుక మనసు తటపట లాడెన్.

Tuesday 3 May 2016

హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా 



చంపకమాల: 
మరిమరి జెప్పితిన్ వినుము మంచిని గూర్పెడు నొక్క మాటనే 
హరిహరులొక్కటేయనెడు నద్భుత సత్యము త్రోసిపుచ్చుచున్
హరి మది దిట్టుచున్ హరుని యర్చన జేయుచు, శంభుదిట్టుచున్ 
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా ! 

Monday 2 May 2016

వార్ధకమ్మునఁ గావలెఁబడుచు భార్య.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వార్ధకమ్మునఁ గావలెఁబడుచు భార్య.




తేటగీతి: 
వయసునందున ప్రేమించ " బడుచు భార్య " 
వాదులాటల గొడవలు " బడుచు భార్య " 
పలువిధమ్ములుగా సాయ " బడుచు భార్య " 
వార్ధకమ్మునఁ గావలెఁ " బడుచు భార్య."

Sunday 1 May 2016

' పాన్ ' వట్టము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - శివుడు ,' పాన్ ' వట్టము. 










కందము:
చిలుకుచు దినుసులు పతికే 
చిలుకలు చుట్టుచును కిళ్ళి చేడియ పెట్టన్
చిలుకును ప్రేమలు సతిపై
చిలుకల రంగుగల చీరె చెయ్యన దెచ్చున్.

తేటగీతి:
పానవట్టమ్ము గాదల్చిపత్ర, మందు
నున్న చెర్రీని శివునిగా నూహజేసి
వేయు దినుసుల ననుకొన వేయిపూలు
కిళ్ళి గట్టగ హరుగొల్చు కీర్తి దక్కు. 

(కిళ్ళి తినే వారిగురించి అడగకండి)