తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 28 February 2015

వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె

తేటగీతి:
ముదిత సీతకు ' ముసలమ్మ ' ముద్దు పేరు
పెండ్లియాడుచు నుండగా వేడ్క మీర
వ్యాఖ్య జేసెను నవ్వుచు బావగారు
" వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె "

Friday 27 February 2015

కారు నలుపు పైన కలిగె ప్రేమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కారు నలుపు పైన కలిగె ప్రేమ


ఆటవెలది:
కారు కొనగ వెడలె కామాక్షి భర్తతో
కనగ రాగ బిలిచె కస్టమర్ల
కార్ల రంగులెన్నొ కనరారు వానిలో
కారు నలుపు పైన కలిగె ప్రేమ

ఆటవెలది:
జోరు వాన మిగుల కారగా పైనుండి
తేరి జూచె సన్న కారు రైతు
తెల్ల మేఘ ముగని తెల్లబోయెనపుడు
కారు నలుపు పైన కలిగె ప్రేమ

Thursday 26 February 2015

కరతాళధ్వనులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కరతాళధ్వనులు. 


కందము:
కరతాళ ధ్వని లేకను
మరి కళ రాణించదయ్య మన చప్పట్లే
మరిమరి యింధనమగు కళ
సరిసరి పెంపొంద, ధనము సరి రాదన్నా !

Wednesday 25 February 2015

కాకికి కేకే ' కాకా '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కాకి .... కేకి


కందము:
కాకికి కేకే ' కాకా '
కేకికి ' కాకాక ' కాక కేకే వేరౌ
కాకీక కాటుకేయిక
కేకికి కోకల్ని జూడ ' కేకే కేకౌ '


అర్థము:
 కాకి "కా కా " అని కేక పెడుతుంది ..
కేకి " కా కా" అని కాక "వేరుగా  " అంటుంది
కాకీక నల్లగా ఉంటే
కేకి కి మాత్రం కోక అందం గా ఉంటుంది...కేకో కేక.....

Tuesday 24 February 2015

దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా  


శార్దూలము:
రారా ! మానస చోర ! చేరుకొనరా ! రావేలరా సుందరా !
హా! రాజా! మనపాలి శత్రువుగదా యాషాఢ మాసంబిదే
చేరన్ రార నెలైన వెంటనె యనెన్ - సెల్ఫోనులో తాను ము
ద్దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా !

Monday 23 February 2015

వరద

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - వరద



కందము:
వరదై పొంగెను నదులే
బురదై రహదారులన్ని పొలములు మునిగెన్
చిరుతిండి గూడ దొరుకక
తిరుగాడెడు కష్టము కడతేర్చుము వరదా !

Sunday 22 February 2015

శరణు కోరెఁ గపోతము చంపెను శిబి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శరణు కోరెఁ గపోతము చంపెను శిబి



తేటగీతి:
శిబి యనందురు ' బిడియాల శివుని ' జనము
బోయడాతడు నడవిని బోవుచుండ
దెబ్బ తిని కాళ్ళపైనను దబ్బున బడి
శరణు కోరెఁ గపోతము- చంపెను శిబి.

Saturday 21 February 2015

మీసములందమ్ము సతికి మెట్టెలకంటెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మీసములందమ్ము సతికి మెట్టెలకంటెన్.


కందము:
పూసల హారము దెచ్చితి
వేసుకు రమ్మనుచు జెప్పె వేడుకతోడన్
వాసూరావ్ దువ్వుచు తన
మీసము "లందమ్ము సతికి మెట్టెలకంటెన్." 

Thursday 19 February 2015

భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. 


తేటగీతి:
భీష్మ పాత్రకు పెట్టింది పేరతనిది
అంబ వేషములో నామె యారితేరె
కలసినాటక మాడుచు కలియ మనసు
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

Wednesday 18 February 2015

మానవులారా! భజనలు మానుట శుభమౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మానవులారా! భజనలు మానుట శుభమౌ.


కందము:
మా నాయకుడే గొప్పని
మా 'నవ ' పార్టీ సరియని మైమరపులతో
మానవ ? వారిని పొగడుట
మానవులారా! భజనలు మానుట శుభమౌ.

Tuesday 17 February 2015

ఏడు వారమ్ములున్ భక్తి వేడుకొందు.

మహా శివరాత్రి శుభాకాంక్షలు.
ఓం నమశ్శివాయ
మీకు అందరికీ శివుడు శుభమ్ములొసగుగాక.



 
















తేటగీతి:
ఆదిశంకర నిన్నునేనాశ్రయింతు
సోమశేఖర నీకునే సుమములిడుదు
మంగళాకార వదలక మదిని గొలుతు 
బుధుడ వంచును దలతురా బుద్ధి గరపు
గురుడవేనీవు మార్గమ్ము గురుతు దెలుపు
శుక్రవంతుడ  దయతోడ   శుభములిమ్ము
శనివి చూడ్కులు నావైపు సాగనీకు
ఏడు వారమ్ములున్ భక్తి   వేడుకొందు.

Monday 16 February 2015

పూలమ్ము పూలమ్మి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పూలమ్ము పూలమ్మి. 


కందము:
తలుపుల వద్దనె యున్నది
తలలో పూలున్న కన్య, తలపుల లోనన్
వలపులు కనబడు, తానా
వల పూలమ్మంగ బోవ పయనంబాయెన్.
 

కందము:
పూలమ్మి' నిలచి యున్నది
పూలమ్మిక డబ్బు తేగ బుట్టను బట్టెన్
కాలమ్ము చెడెను జాగ్రత
గాలమ్ముల గని చనవలె గద మీనాక్షీ !


కందము:
పూలమ్మెడు పూబోణీ !
పూలకు బోణీల కొరకు పో జాగ్రతగా !
పూలను భ్రమరమ్ములతో
పూలవి అమ్ములను వేయు పోకిరి తోడన్.

Sunday 15 February 2015

పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.


తేటగీతి:
ఉప్పునీరని తెలిసియు గొప్ప కొరకు
వంద పందెమ్ము, త్రాగెద నిందు చూడు
డనుచు నొక్కడు పూని ప్రతినను జేసి
పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.


Saturday 14 February 2015

దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.






సమస్య - దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.



కందము:
సిరులను మూటల నిడి పా
తరలోనే దాచి పెట్టి తరలగ దివికిన్
మరి తినరు వారలును తమ
దురదృష్టము వలన, సిరులు దొరకు జనులకున్.

Thursday 12 February 2015

" పట్టి " ప్రేమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - " పట్టి "  ప్రేమ

 



















కందము:
పట్టిని గట్టిగ చేతను
బట్టుచు తా త్రొక్కుచుండె పట్టిన రిక్షాన్
పట్టెడు తిన లేకున్నను
పుట్టెడు ప్రేమగలదయ్య పుత్రుని మీదన్.

తేటగీతి:
కడుపు నింపుట కుండెను కాలి బలము
బ్రతుకు నీడ్చెద వెనుకెంత భారమైన
కడుపు బుట్టిన వాడింత కాడు బరువు
కడుపు లోపల బెట్టెద నొడుపుగాను 

Wednesday 11 February 2015

రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.


తేటగీతి:
మేనక యుండె, రంభయు మీద గలదు
స్వర్గ మందున సుత్రాము సరసమునకు
చేర రాగను, మరియు శచీ మనోభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

Tuesday 10 February 2015

క్రొత్తకాపురము

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - క్రొత్తకాపురము


పూర్వము కొన్ని ఉమ్మడి కుటుంబాలలో క్రొత్త కాపురం ఇలా...

ఆటవెలది:
అత్త చేత తిట్లు, నాడబిడ్డల మొట్లు
భర్తకు నగచాట్లు భామ ఫీట్లు
మామ మదికి తూట్లు మరిసర్దు కొనుటెట్లు
క్రొత్త కాపురమున కొన్నిపాట్లు

Monday 9 February 2015

ముసురు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం : ముసురు


 













తేటగీతి:
ముసురుకున్నట్టి మబ్బుల ముందుజూచి
కసరబోకుము పోదులే ఉసురు నీకు
పచ్చకోకలు తనకేమొ వచ్చుననుచు
మురిసి పోవును మనతల్లి భూమి గాదె.

Sunday 8 February 2015

చచ్చిన వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చచ్చిన వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్. 


కందము:
మెచ్చెడు రీతిగ రైతే
పచ్చని పైరేమొ పెంచ, పండెడు వేళన్
వచ్చిన తెగులున మొక్కలు
చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

Saturday 7 February 2015

న ' వల '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - నవల


కందము:
నవనవ లాడెడి విధముగ
నవరసములతోడ మెచ్చు నాయిక మరియున్
నవలా నాయకు లుండెడి
నవలల కాలమ్ము పోయె నట 'నెట్' వలతో.

Friday 6 February 2015

శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.


కందము:
శరవేగమ్మున మీదికి
మరి వచ్చిన పులిని గొట్ట మానవు డొకడున్
దరి జేరి పులికి నాటిన
శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

Thursday 5 February 2015

పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు

తేటగీతి:
ఆ త్రిమూర్తుల జంటల నరసి జూడ
వాణి పెండ్లాము నలువకు, పశుపతికిని
పెండ్ల మయ్యెను బార్వతి, విష్ణువునకు
పెండ్లమాయెనుగా లక్ష్మి వేడుకలర.

Wednesday 4 February 2015

తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.


ఉత్పలమాల:
మేలుగ పెండ్లియాడి మది మెచ్చిన రీతిగ ప్రేమయాత్రకై
చాలప్రదేశముల్ తిరిగి చక్కని తోటను సేద తీరగా
కేలును జాపగా పతియు కిమ్మనకుండను చేరి కౌగిటన్
తేలును, ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.


Tuesday 3 February 2015

అత్త లేని కోడలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

అత్తలేని కోడలుత్తమురాలు...(కోడలుతమురాలై అత్తను అమ్మనుకుంటే ఇంక అత్తెక్కడుంటుంది.)
కోడల్లేని అత్త గుణవంతురాలు...(అత్త గుణవంతురాలై కోడల్ని కూతురనుకుంటే ఇంక కోడలెక్కడుంటుంది)



వర్ణన - అత్త లేని కోడలు



కందము:
అత్తను తల్లిగ కోడలు
అత్తయు కోడలిని కూతురనుచును చూడన్
అత్తలు కోడండ్రుండరు
క్రొత్తగ నుత్తములు వినరె ! గుణవంతులునున్.




Monday 2 February 2015

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్



చంపకమాల:
శరణము గోరుమన్న యను జన్ముని తన్నెను, వెళ్ళిపొమ్మనెన్
మరణము లేదు నాకననుచు, మానవులెంతని మేదినీ సుతన్
మరి మరి చేరగోరు విష మానసు, రావణు, భావజాత లా
భ రతుని, జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్