తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 31 December 2013

నా కన్నా! నీదు ముద్దు నాకన్నమురా !

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - నా కన్నా! నీదు ముద్దు నాకన్నమురా !

 













 

 

కందము:
నీకన్నా నాకెవ్వరు
నా కన్నా ! నీదు ముద్దు నాకన్నమురా !
నాకున్న దానిలోనే
నీకన్నియు ముద్దుకన్న ! నేనిత్తునురా !

Sunday 29 December 2013

అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్

చంపకమాల:
పరువము నాడు తెల్గు నతి భారముగా మది దల్చి నానుగా
తిరిగితి దేశ దేశ ములు తీరుగ నిప్పుడు చేరినాను నా
భరతమునందు నాంధ్రమున, భాగ్యమె కోరిక గల్గె నేర్వగా
నరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్

Saturday 28 December 2013

నీటముంచినా నన్ను పాలముంచు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - నీటముంచినా నన్ను పాలముంచు

 













కందము:
ఉంచితి నాకులు  నీపై
నుంచకు వ్యాకులము నాదు యుల్లమునందున్
ముంచుదు నీటను నిన్నే
ముంచుము నను పాలలోన మూషిక వాహా ! 

Friday 27 December 2013

హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

కందము:
అనితయె శంభుని పుత్రిక
కనగా నేడామె నొక్క కన్నను ' హనుమన్ '
మనుమడు పుట్టెను నాకని
హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

కందము:
వినుడయ్యా శ్రీ రాముని
మనమున తానుండు గాదె మహదేవుండే
హనుమకు ముద్దిడ రాముడు
హనుమను ముద్దాడె శంభుఁ డానందమునన్.

Thursday 26 December 2013

కవికోకిల జాషువా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కవికోకిల జాషువా


















 




కందము:
కాకిగ తలచిన చోటనె
కోకిలగా నీవు మారి కూర్చితివయ్యా !
ఓ " కవికోకిల " ! యిలలో
నీ కవితలు నిలచు తెలుగు నిలబడు వరకున్.


Wednesday 25 December 2013

ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున

తేటగీతి:
భారతమ్మును చదువుట భార మిపుడు
" టీవి షో " లోన నొక్కడు ఠీవి గాను
చెప్పె ప్రశ్నకు బదులును సిగ్గు లేక
" ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున. "

Tuesday 24 December 2013

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు..


 


















కందము:
కొమ్మలు లేకనె పూచెను
కొమ్మకు నరచేత నుంచ క్రొత్తగ పూలన్
కమ్మని గోరింటాకది
ఇమ్ముగ సత్పతినె యిచ్చు నెరుపుగ పండెన్.

Monday 23 December 2013

పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.  

ఉత్పలమాల: 
తెల్లని ముష్కరాధములు తెల్గున తేజము రామ రాజునే
మెల్లగ నమ్మకంబునను మీదట చర్చకు బిల్చి చాటుగా
నల్లదె బట్టి రూధరట నాశము జేయగ నెంచె, జూడగా
పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

Sunday 22 December 2013

కోపి నకులుఁడు భ్రాతను రూపుమాపె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కోపి నకులుఁడు భ్రాతను రూపుమాపె.
తేటగీతి:
మునికి దుర్వాసు నకుగల ముద్దు పేరు ?
మాద్రి పుత్రులలో నొక్క మాన్యు డెవరు ?
రావణానుజు పని యేమి రాము గలసి ?
కోపి- నకులుఁడు- భ్రాతను రూపుమాపె.

Saturday 21 December 2013

నైమిశారణ్యము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - నైమిశారణ్యము.






















కందము:
వనమిది భారత శుభ జీ
వనమునకే తొల్లి మెట్టు వైదిక ధర్మా
వనులకు స్థానము మన భా
వనమున దలచిన జాలును భాగ్యము లబ్బున్. 

Friday 20 December 2013

శకుంతల ప్రేమలేఖ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - శకుంతల ప్రేమలేఖ

 


















ఉత్పలమాల:
చెంగట నిల్చి బాసలను చేతను చేయిని వైచి చేసి, నా
యంగుళి జేర్చి యుంగరము నన్నిటి దోచిన రాజ శేఖరా !
రంగుల భావ జాలములు వ్రాయుచు నుంటిని  రార వేగ  నీ
యంగన తప్పుజేసెననుచందరు నందురురాకపోయినన్ ! 

Thursday 19 December 2013

దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్. 

కందము:
దయ్యమ్మొక్కటి " రా ! మా
భయ్యా నిన్ జంపు " ననుచు పలుకగ, నాహా !
దయ్యము 'రామా' యనెనని
దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.

Wednesday 18 December 2013

' మూల ' పురుషుడు ..ఈశానుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - ' మూల ' పురుషుడు ..ఈశానుడు.

























కందము:
క్లేశమ్ములు రావని నరు
డీశాన్యపు మూలబెంచి యింటిని గట్టున్
ఈశా ! నీవే మూలం
బే శాస్త్రము  కైన, నిడుదు నివిగో జోతల్ ! 

Tuesday 17 December 2013

నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగ లాడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగ లాడెన్.

కందము:
నెలఱేని ముఖము నెలతది
నెలతప్పిన నాటినుండి ' నెలబాలుని ' కై
నెలలెనిమిది వేచియు నొక
నెలలో సుతుఁగన్న తల్లి నిగనిగ లాడెన్.

కందము:
కలవర మాయెను మదిలో
నెలలన్నియు నిండగానె నెలతకు, డాక్టర్
లలితాదేవి  క్లినికు  " వె
న్నెల " లో సుతుఁగన్న తల్లి నిగనిగ లాడెన్.

Monday 16 December 2013

వాయువు ప్రాణులకాయువు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - వాయువు ప్రాణులకాయువు 
























కందము:
వాయువు లేకను ప్రాణుల
కాయువు లేదయ్య జగతి గాచెడు దైవం
బాయన మ్రొక్కుదు క్షణమున్
బాయక నే శ్వాస తోనె భావన లోనన్.

Sunday 15 December 2013

ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.
తేటగీతి:
శ్రేయ మెపుడు స్వధర్మమ్ము సేయు చుంట
ప్రాణ గండము నందైన పార రాదు
మెరుపు లున్నను దలచుచు మెరుగు, పరుల
ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.

Tuesday 10 December 2013

విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు


ఆటవెలది:
చూడ నేడు జెప్పు " స్టూడెంట్సు " కొందరు
శ్రీపతికిని మ్రొక్క శ్రీమతి నిడు
పశుపతికిని మ్రొక్క పశువుల నే యిచ్చు
విఘ్నపతికి మ్రొక్క విఘ్నములిడు. 

Monday 9 December 2013

కుడుములకిడుముల దొలగించు స్వామి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కుడుములకిడుముల దొలగించు స్వామి

 
 

      

















ఆటవెలది:
కుడుము లడుగు, మనల కిడుముల దొలగించు
గరిక పోచ లడుగు, సిరుల నిచ్చు
ముంచ మనును నీట, ముంచును గద పాల
నేన్గు ముఖపు దేవు నేను గొలుతు. 

Sunday 8 December 2013

శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి

తేటగీతి:
రాము ప్రక్కన నున్నట్టి రమణి వలన
తనను జూచుట లేదని తలచి యపుడు
శూర్పణఖ, సాధ్వి లోకైక సుందరాంగి
సీత దూరగ గోల్పోయె చెవులు ముక్కు.

Saturday 7 December 2013

' ని ' యమ రాజు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - ' ని '  యమ రాజు
























కందము:
యమ రాజా ! చూడగను ని
యమమును పాటించు టందు నాద్యుడ వీవే
సమవర్తీ ! నా ప్రాణపు
సుమమది నీదయ్య, నాకు సుగతుల నీవే !

Friday 6 December 2013

అల్లము, చింతపండు, కోతిమీర, జీర...భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - అల్లము, చింతపండు, కోతిమీర, జీర...భారతార్థంలో

ద్రౌపది అర్జునునితో...
తేటగీతి:
అల్ల ముక్కంటి నెదిరిన మల్లు మీరు
కోతి మీరథమున దీర గొల్వు, దీరు
చింత, పండుగ గానగు జేసి సమర
మందు జీరగ పగతుర నపుడె శాంతి.

Thursday 5 December 2013

హవ్యవాహనుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - హవ్యవాహనుడు


 


















కందము:
సర్వము భక్షించెద వట
సర్వులకున్ రక్షనిచ్చి సాకెద వటగా
ఉర్విని హవ్యము నీయగ
గీర్వాణుల కిచ్చు నీకు కేలును మోడ్తున్.

Wednesday 4 December 2013

చీరెకట్టు, కట్ చేయకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - చీరెకట్టు, కట్ చేయకు



 



















కందము:
కట్టు బొట్టులు జూడంగ కాంత లందు
భారతీయత కనిపించు చీరె గట్ట
బరువటంచును పోవును పరువటంచు
పరుల ' జీన్సును ' వేతురే తరుణు లార !

Tuesday 3 December 2013

బావల భుజియించుటే శుభావహ మందున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బావల భుజియించుటే శుభావహ మందున్


కందము:
బావా! గతికిన యతకదు
పోవలదులె పిల్ల యింటి భోజన మునకై
శ్రావణ నిశ్చయ లగ్నం
బావల భుజియించుటే శుభావహ మందున్

Monday 2 December 2013

' సన్నకారు ' కారు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - ' సన్నకారు '  కారు.


 


















తేటగీతి:
కారు పై మోజు గల ' సన్నకారు ' రైతు
బండి వేషము మారిచె దండి గాను
గానుగెద్దును బూనిచి తాను సాగ
రథము నెక్కెనుగా మనోరథము దీర.

Sunday 1 December 2013

వంకయున్నవాడు శంకరుండు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 09 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వంకయున్నవాడు శంకరుండు


ఆటవెలది: 
పండితుండు గాని పామరుండే గాని
సురలు గాని మరి యసురులు గాని
వాడు వీడు యనక వరమిచ్చు నన్నట్టి
వంకయున్నవాడు శంకరుండు.