అందరకు గణేశ చతుర్థి శుభాకాంక్షలు. ఏ విషయాన్నయినా చందోబద్దంగా చెప్పటం మన సంప్రదాయం. అలా ఛందో బద్దంగా ఉన్నవాటిని నేర్చుకున్నప్పుడు ఎప్పటకీ మరచి పోము.. చిన్నతనం లో మా తల్లిదండ్రులు నేర్పిన ఒక పద్యాన్ని ప్రచురిస్తున్నాను.ఇది నేర్చుకున్న వారికి వినాయకుని పూజకు ఉపయోగించ వలసిన ఏకవింశతి (21 ) రకముల పత్రి పేర్లు కరతలామలకము లౌతాయి. ఈ తరం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇస్తున్నాను. ఏమైనా దోషములు, సవరణలు వుంటే విజ్ఞులు, పెద్దలు సూచించినచో సరిదిద్ద గలవాడను.
ఇది సంప్రదాయంగా పెద్దలు చెప్పుచున్న పద్యం . మూలము, రచయిత పేరు తెలియదు.
సీ : సిద్ధి వినాయకా ! నిన్ను ప్రసిద్ధి గా పూజింతు
నొనరంగ నిరువది యొక్క పత్రి !
దానిమ్మ, మరువము, దర్భ, విష్నుక్రాంత,
ఉమ్మెత్త, దూర్వార, ఉత్తరేణి,
గరికయు, మారేడు, గన్నేరు, జిల్లేడు,
దేవకాంచన, రేగు, దేవదారు,
జాజి, బల్రక్కసి, జమ్మి, ఆవల తుమ్మి,
మాచి పత్రియు, నారె, మంచి మునగ,
తే.గీ : అగరు గంధమ్ము కురువేరు అక్షతలును
ధూప దీపమ్ము నైవేద్య *హారతులను
భాద్రపద శుధ్ధ చవితిని పట్ట పగలు
కోరి పూజింతు నిను నేను కోర్కె దీర !
(* యతి భంగము -సరి యగు పదము తెలిసిన విజ్ఞులు తెలుపగలరు )
No comments:
Post a Comment