తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 30 April 2013

కోపమే భూషణము నీతికోవిదునకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కోపమే భూషణము నీతికోవిదునకు
తేటగీతి:
మంచి మాటలు వినని సమాజమునకు
ధర్మ బోధల చక్కని దారి జూపు
వేళలందున గురువుగా వెలుగు వేళ
కోపమే భూషణము నీతికోవిదునకు

Monday 29 April 2013

బోడి గుండంట జడలేమొ బోలెడంట.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - బోడి గుండంట జడలేమొ బోలెడంట.

తేటగీతి:
ఒడుగు ప్రక్రియ పూర్తాయె నుదయముననె
వటువు కక్కలు నల్గురు వరుసగాను
చుట్టు ముట్టిరి ముద్దిడ, చూడగాను
బోడి గుండంట జడలేమొ బోలెడంట.

Sunday 28 April 2013

కరము కరము మోదకరము గాదె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కరము కరము మోదకరము గాదె
ఆటవెలది:
కరము కరము మోద కలహంబులే హెచ్చు
కరము కరము కలుప కలియు మనసు
కలహ మునకు గాక కలియుటకు గలుప
కరము కరము  మోదకరము గాదె
!

Saturday 27 April 2013

గణపతినిఁ గన నిందలొదవును గాదే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - గణపతినిఁ గన నిందలొదవును గాదే.

కందము:
మాగదిలో మువ్వురమే
యోగేశుని ముఖమును గన నుదయము నాకున్
బాగా పనులౌ నింకొక
డో  గణపతినిఁ గన నిందలొదవును గాదే.

Thursday 25 April 2013

కనరాని విశేషములను కవి కాంచు గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కనరాని విశేషములను కవి కాంచు గదా 

కందము:
ఘన వరగజ గమనుడు గజ
మును మును బ్రోవంగ వచ్చు ముచ్చట వ్రాసెన్
గని నట్టుగ మన పోతన
కనరాని విశేషములను కవి కాంచు గదా!

Wednesday 24 April 2013

పాపములకు మూలములగు పశుపతి పూజల్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పాపములకు మూలములగు పశుపతి పూజల్

కందము:
కోపము తాపము  నరునికి
పాపములకు మూలములగు, పశుపతి పూజల్
రేపులు మాపుల నాపక
చేపట్టిన శాంతి గలుగు చెడుగును మాపున్.


Tuesday 23 April 2013

బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు

తేటగీతి:
చేత బట్టుక ద్రౌపది  చీరె లాగు
నటన జూపక జీవించు నటుని జూచి
రయము నాపగ నాటక రంగ మందు
బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు

Monday 22 April 2013

భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్.

ఉత్పలమాల:
కోమలి చేయి బట్టి పతి కూడెను శయ్యను సంతసంబుతో
ప్రేమగ పూల నిచ్చె సఖి ప్రేయసి కిచ్చెను పట్టు చీరె, తా
రామణి హారమిచ్చి దరి రమ్మనె దాలిచి, ముద్దులిచ్చె తా
భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్.

Sunday 21 April 2013

కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.

కందము:
వినుమా మేమీ నియమము
ననవరతము విడువ బోమ ననుచును భువిలో
మనసున నిగ్రహమున చెడు
కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.

Saturday 20 April 2013

దైవ శక్తిని హరియించు దనుజ బలము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - దైవ శక్తిని హరియించు దనుజ బలము.

తేటగీతి:
అసురగుణములు సురగుణం బణగియుండు
మనిషి మనసున, భక్తినే మనము నిలుప
బలము మనమునకు పెరిగి భక్తి లేపు
దైవ శక్తిని, హరియించు దనుజ బలము.

Friday 19 April 2013

రామా! లయమును జేయుము

 















బ్లాగు వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీరామశ్శరణం మమ.

కందము:


రామా! లయమును జేయుము
రా! మాయను  యిహమునందు రాగము ననుచున్
రామాలయమును జేరుచు
రామా!యను వారి రక్ష రాముడె చూచున్ .

Thursday 18 April 2013

విధవ యనుచు బిల్చె విభుడు సతిని.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - విధవ యనుచు బిల్చె విభుడు సతిని.

ఆటవెలది:
వెధవ యనిన నిట్లు ’వెయ్యేళ్ళు  ధనముతో
వర్ధిలగను’ జెప్పు ప్రథమ పదము
‘విభుని గూడి’ యనుచు వేరుగా మారిచి
విధవ యనుచు బిల్చె విభుడు సతిని. 

Wednesday 17 April 2013

నాగ పంచమి వచ్చును నవమి నాడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - నాగ పంచమి వచ్చును నవమి నాడు

తేటగీతి:
పాడ్యమీ తిథిన గద  సంవత్సరాది

పరగ దసరాయె దశమిని, పంచమికిని
నాగ పంచమి వచ్చును, నవమి నాడు
రామ నవమియె వచ్చును భామ వినుమ.

Tuesday 16 April 2013

పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.
తేటగీతి:
మఱ్ఱియాకున బజ్జుండు కుర్రవాడు
భువన భాండమ్ము లన్నియు బొజ్జ నుండు
మఱ్ఱి విత్తనముల వోలె మనుపు నట్టి
పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

Sunday 14 April 2013

రామనామ మనిన రక్తి రాక్షసులకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రామనామ మనిన రక్తి  రాక్షసులకు

తేటగీతి:
రామ రావణ సైన్యమ్ము రంగ మందు
ననికి నిలిచెను, "శ్రీ రామ"  యను  కపులకు
రామనామ మనిన రక్తి ,   రాక్షసులకు
రావణాసుర నామమ్ము రక్తి గొలుపు.

Saturday 13 April 2013

మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్.

కందము:
కొంచెము వీలే కలుగద
టంచును భద్రాద్రి పెండ్లి కరుగని వారే
మంచిగ 'టీవీ' చూచెద
మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్.

Friday 12 April 2013

పరులకు రామ చంద్రుని వివాహము పుణ్య ఫల ప్రదంబగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పరులకు రామ చంద్రుని వివాహము పుణ్య ఫల ప్రదంబగున్
చంపకమాల:
మురియుచు దోయిలందు తెలి ముత్యము లన్నియు పట్ట రాముడున్
మెరవగ నీలి వర్ణమున మీదట జానకి చేత నెర్రనై
వరుసగ రంగు మారు తల బ్రాలను భక్తిని దల్చుచుండు చూ
పరులకు రామ చంద్రుని వివాహము పుణ్య ఫల ప్రదంబగున్

Thursday 11 April 2013

విజయుని సారథి కృపచే

 బ్లాగు వీక్షకులకు
శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు.



















కందము:
విజయుని సారథి కృపచే
విజయమ్ముల మాకు నిచ్చి  వేడుక గా నీ
విజయ యను పేరు పోకను 
విజయము గా నిలువు మమ్మ వీడెడు వరకున్.

Wednesday 10 April 2013

రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో

చంపకమాల:
రమణి వివాహ మాడ ఘన రాజస మొప్పగ వచ్చి వేల భూ
రమణులు చేత గాక నట లజ్జితులై తల వాల్చ పార్వతీ
రమణుని విల్లు ద్రుంచ గనె రామునకున్ రవితేజ శూర వీ
ర మణికి, సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

Tuesday 9 April 2013

కాలుని పెండ్లాడె సీత కడు మోదమునన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కాలుని పెండ్లాడె సీత కడు మోదమునన్.
కందము:
కాలును మోపెను భువిపై
కాలునిగా రాక్షసులను కాటికి బంపన్
కాలుని విలు ద్రుంచిన సమ
కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్.

కందము:
కాలుని విల్లును ద్రుంచి స
కాలములో రాముడెదుట కనుపించగనే
మేలుగ దలచుచు మనసున
కాలుని, పెండ్లాడె సీత కడు మోదమునన్.

కందము:
మేలాయెను సెల్ ఫోన్ తో
కాలేజీ రోజుల నొక కాల్జేసెను, రాంగ్
కాలే ప్రేమా యెను, 'రాంగ్
కాలుని' పెండ్లాడె సీత కడు మోదమునన్
సమస్య - కాలునిఁ బెండ్లియాడె నఁటఁ గామిని సీత మహోత్సవంబునన్.

ఉత్పలమాల:
కాలుని వేష ధారి మరి కామిని పాత్రను వేయు సీతయే
సోలిరి ప్రేమలోన గన సోయగ మొప్పగ ప్రేక్షకాళియే
పూలను జల్లి సంబరము పొల్పుగ జేసిరి మంటపమ్ములో
కాలునిఁ బెండ్లియాడె నఁటఁ గామిని సీత మహోత్సవంబునన్.

Monday 8 April 2013

అల్లుడనయ్యెదన్, మగడనయ్యెద, నేమనుమండనయ్యెదన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అల్లుడనయ్యెదన్, మగడనయ్యెద, నేమనుమండనయ్యెదన్.

ఉత్పలమాల:
పిల్లడ! చేర రార! మరి పెండ్లిని యాడితి నత్త కూతునే
నల్లన జూడగా వరుస లన్నియు జెప్పెద నాలకింపుమా
మెల్లగ! నత్తగారికిని మీదట భార్యకు నామె తాతకే
అల్లుడనయ్యెదన్, మగడనయ్యెద, నేమనుమండనయ్యెదన్ !

Sunday 7 April 2013

మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

తేటగీతి:
ఆలు బిడ్డల విడనాడి యడవి కేగి
ఆకు లలముల దినుచును హరిని దలచి
మోక్ష కన్యను గోరి నిరీక్ష జేయు
మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

Saturday 6 April 2013

చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

తేటగీతి:
రావి వారింట బుట్టెను 'రాయు' డతడు
రాక్ష సంబుగ  జెరచెను 'లత'ను నాడు
శిక్ష బొందెను నేడామె చేయ పోరు
చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

Friday 5 April 2013

మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

ఉత్పలమాల:
చేరిరి దేవ రాక్షసులు చిల్కిరి క్షీర సముద్ర మంతటన్
కోరిన దందగా సుధను కోరుచు పోరును సల్ప నెంచగా
వైరుల మోసగింఛి తన వారికి మేలును జేయ శ్రీ హరే
మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

Thursday 4 April 2013

తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

శార్దూలము:
వారంబుల్ మరి రెండు మూడు గడిచెన్ వారొంది రస్వస్థతన్
ఈరోజే మరి తాను స్వస్థుడవగా నిప్పట్టు శార్దూలమున్
పూరించంగ సమస్య నిచ్చె సరిగా పోరాడి మీరే గెలు
స్తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై. 
 

సరదాగా..

శార్దూలము:
శ్రీ రామ్ రాజ్యమ్ము హిట్టయెన్ అనెనిటున్ శ్రీ సాయి బాబా వరుల్
ఈ రోజో మరి రేపొ క్రొత్త సినిమా కీ దర్శకుల్ శంకరే
హీరో బాలయ శంకరా ఎవరికన్ హీరోయినన్నన్, నయన్
తారా, రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై

Wednesday 3 April 2013

పండు వెన్నెల లివె యమావాస్య గురిసె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పండువెన్నెల లివె యమావాస్యఁ గురిసె.

తేటగీతి:
ప్రమిద లెన్నియో వెలిగించ ప్రమదలచట
చిచ్చు బుడ్లు మతాబులు హెచ్చు గాను
పిల్ల లందరు గాల్చగా వెల్లి విరిసి
పండువెన్నెల లివె యమావాస్యఁ గురిసె.


తేటగీతి:
చిన్ని గుండెకు పడె చిల్లి, చిట్టి తండ్రి
వేదనార్పగ నల్లాడె పేద తల్లి
దాత లెందరో కలసి చేయూత నీయ
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె

Tuesday 2 April 2013

కలను దలచి హృదయకమల మలరె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కలను దలచి హృదయకమల మలరె.

ఆటవెలది:
అన్న నిన్ను వీడ ననుచున్న భరతుని
అనునయించి ప్రీతి నతని కోర్కె
ననుస రించి యిడగ నారామ విభు పాదు
కలను దలచి హృదయకమల మలరె.

Monday 1 April 2013

పుండు సతిని గాంచి మోదమొందె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పుండు సతిని గాంచి మోదమొందె.

ఆటవెలది: 
కలిని జనులు మిగుల నలమ టింతురు గాన
హనుమ కవచ మిచ్చి హాయి నిడుమ
యనిన పుత్ర ప్రేమ గనుచు నా లోకాధి
పుండు సతిని గాంచి మోదమొందె.