తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 9 August 2012

చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - చేరె నవరసమ్ములలోన నీరసమ్ము.


తేటగీతి: 
జీవనంబున నరులకు చేవనిచ్చి
నిత్యసత్యము, పోగొట్టు నీరసమ్ము
హాయి గొలుపుచు మురిపించు హాస్య రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

మదిని కలతల అలలను మరుగు పరచు
చక్క దిద్దును మానవ జీవ సరళి
శాంతమన్నది లేకను సౌఖ్య మేది
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము. 


ప్రేమయన్నది నిత్యము పెంపు నొందు
సకల జీవుల కియ్యది సౌఖ్య దమ్ము
రసము లన్నిట శృంగార రసము మేటి
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

భయము లేనిచొ మారు ప్ర వర్తనమ్ము
భక్తి యన్నది మది నిల్పి భయము విడుడు
భయమె యవసర మేరికి బాగు పడగ
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

కఠిన మెప్పుడు చేయును గాయములను
కరుణ వీడిన సృష్టి వికలమె యగును
కదలు చుండును జగమంత కరుణ తోడ
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

సత్యమన్నది మరచి నిస్సత్తువయిన
కార్య నిర్వహణమ్మది కరగి పోగ
చేర నడపును ముందుకు వీర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

హద్దు దాటగ భీభత్స మగును నరుని
జీవితమ్మున, సరిహద్దు చేరి మీర
ఫలిత మిదియని చెప్పు భీభత్సరసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము

రౌద్ర మన్నది లేకున్న భద్ర మేది
ఛిద్ర మగునని దేవుడే రుద్రుడాయె
నిద్ర పోగొట్టు మోతాదు రౌద్ర రసము
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము

నవ రసంబులు కావలె నరుని కెపుడు
వాటి మోతాదు సరి జూచి వాడు కొనిన
అద్భుతమ్మని మది నెంచు
ద్భుతమ్మె;
చేరె నవరసమ్ములలోన నీ రసమ్ము.

No comments: