తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 28 March 2012

వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 21-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి


తేటగీతి :
మాటు వేసెను పొదలను చాటు జేరి
వ్యాఘ్ర మాఁకొని, మేసెను పచ్చగడ్డి
లేడి ప్రక్కన మిత్తిని జూడ లేక
యెవరి యాకలి వారిది యేమి చెపుదు?

Tuesday 27 March 2012

నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 20-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

రామాజ్ఞ ననుసరించి సీతను అడవిలో ఒంటరిగా వదలి వెళ్లుచూ లక్ష్మణుడు అష్ట దిక్పాలురతో తల్లిని జాగ్రత్తగా చూడుడని మ్రొక్కిన విధము...

చంపకమాల :
ఇనకుల చంద్రు డిట్లు తన యింతిని కానల పాలు జేసెగా
మనమున మ్రొక్కుచుంటి నిట మాతను జక్కగ రక్ష జేయగా
ఎనిమిది దిక్కులన్ జగతి నేలుచు నుండెడి నేతలార! నే
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్!! 

Monday 26 March 2012

కప్పి చెప్పు నదియె కవిత యగును.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 20-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  కప్పి చెప్పు నదియె కవిత యగును.


ఆటవెలది :
విషయ మరసి యాత్మ విశ్వాసమును జూపి
పద్య పాద ములను హృద్య ముగను
ఆశువైనను, కవి తావేశము తనపై
కప్పి, చెప్పు నదియె కవిత యగును.

Sunday 25 March 2012

కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 19-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్

కందము : 
చప్పున మ్రింగగ బోయెను
కప్పను జూడంగఁ బాము, గడగడ వడఁకెన్
కప్పయె, బెక బెక మనితా
నప్పుడు చిరు కాల్వ ప్రక్క నడుసున దూరెన్. 

Saturday 24 March 2012

బొంకి నాడు హరిశ్చంద్ర భూవరుండు

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 19-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  బొంకి నాడు హరిశ్చంద్ర భూవరుండు


తేటగీతి :   
'మీకు ఋణమేమి నేలేను ! మీరలెవ్వ ?
రనుచు బొంకిన వచ్చు నీ రాజ్య లక్ష్మి' !
యనిన చెప్పెను "నేనొప్ప నట్టి సిరులు
బొంకి"  నాడు హరిశ్చంద్ర భూవరుండు



Friday 23 March 2012

ఆనంద " నందన " శుభాకాంక్షలు.

అందరకు నూతన 'నందన' నామ ఉగాది శుభాకాంక్షలు.

కందము :
ఆ నందుని నందను దయ
ఈ నందన వత్సరమ్ము నేకాలమ్మున్
ఆనంద మందు డెందము  
ఆ నందీశ్వర  గమనుడు హాయిగ  బ్రోచున్.

Thursday 22 March 2012

ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 18-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య -  ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్


కందము :
ఎత్తగు ఎవరె స్టెక్కడ ?
హత్తెరి పండేమి దొరకె హనుమకు? ఏలా
ఇత్తరి కోడిట  కూసెను?
ఉత్తరమున - భానుబింబ - ముదయం బాయెన్

Wednesday 21 March 2012

చింతామణి కన్న మంచి చెలువలు గలరే

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 18-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య -  చింతామణి కన్న మంచి చెలువలు గలరే


కందము :
చింతా క్రాంతము గాకుమ 
ఎంతో సాయమ్ము జేతురీ కష్టములో
వంతులు వేసుక,   శ్రీమణి
చింతామణి కన్న మంచి చెలువలు గలరే ?

Tuesday 20 March 2012

మరుఁడు మురిపించె యముఁడు కింకరులఁ జూపె

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 17-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - మరుఁడు మురిపించె యముఁడు కింకరులఁ జూపె


తేటగీతి :
సుతుడు జేసిన నాట్యమ్ము జూచి తిరిగి
యింటి కేగుచు కారులో నొంట రిగను
హత్య గాబడె  విధి నేమనందు?   తన  కొ
మరుఁడు మురిపించె, యముఁడు కింకరులఁ జూపె.

Monday 19 March 2012

యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 17-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్. 

కందము :
యోగియను వైద్యు డాతడు
భోగములను మునిగి తేలి భువినైడ్సనునా
రోగము గలస్త్రీ తో సం
యోగము ప్రాణాంతకమని 'యోగి' వచించెన్. 

Tuesday 13 March 2012

వక్త్రంబు ల్పది, కన్ను లైదు, కరముల్ వర్ణింపగా వేయగున్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 16-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

 సమస్య - వక్త్రంబు ల్పది, కన్ను లైదు, కరముల్ వర్ణింపగా వేయగున్

శార్దూలము : 
వాక్త్రోచన్ మది భారతీ కృప సుమా ! వాక్రుచ్చు లంకాధిపున్
వక్త్రంబుల్ -  కలవెన్ని ఈశ్వరునకున్ ఫాలంబుపై నేత్రముల్
వక్త్రంబుల్ మరి  యైదు  యున్న,  చెపుమా ! పై సూర్యు శ్రీ హస్తముల్
వక్త్రంబు ల్పది - కన్ను లైదు - కరముల్ వర్ణింపగా వేయగున్ .

Monday 12 March 2012

కంచి గరుడ సేవ మంచి దగును

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 16-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  కంచి గరుడ సేవ మంచి దగును

ఆటవెలది :
ఫలిత మేమి లేని పరమాత్ము సేవండ్రు
కంచి గరుడ సేవ, మంచి దగును
కర్మ ఫలము వదలి కర్మనే జేయంగ
కరుణ జూపు తానె కమల ధవుడు. 

Sunday 11 March 2012

వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 15-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య -  వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.


శార్దూలము :
వర్షంబుల్ గడువంగ చూడుడిక  మా వైభోగ మేమందుమో
హర్షంబే నని "యూపియే" కుదురుగా హాహాహ యన్నంతలో
శీర్షంబే తలక్రిందులాయె కన " టూజీ, స్విస్సు స్కాం" మబ్బుగా
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.


(వైశాఖ మాసంలో వసంతకాలముంటుంది.
అలాటి వసంతకాలమనుకున్న తరుణంలో స్కాం మబ్బులు క్రమ్మి కురుసిన అరోపణల వర్షము UPA  సర్కారుకు గ్రీష్మం లా వేడిని పుట్టించాయని నా భావం.)

Saturday 10 March 2012

తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 15-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య -  తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్


కందము :
ఘన యదు నందుని నందను
గని మది తా జంపనెంచి కంసుని పనుపన్
తన యొడి లో జేరిచి పూ
తన, ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్.

Friday 9 March 2012

ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ ఫాల భాగంబునన్.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 14-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ ఫాల భాగంబునన్. 

శార్దూలము : 
అంకం బందున ముద్దుజేసి యటుపై నాబాల కృష్ణుండు గా
శంకర్ బాబుకు వేషమున్ మలచుచున్ చక్కంగ మార్చేవుగా !
ఇంకన్ బూయుము నీల వర్ణ మిచటన్నీ ప్రక్కగా  యప్పుడే
ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము, తన్వీ!ఫాలభాగంబునన్. 

Thursday 8 March 2012

కన్నవారలు క్రూరులు కఠినులు గద

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 14-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కన్నవారలు  క్రూరులు కఠినులు గద

తేటగీతి : 
ఉగ్ర వాదము నేర్పించి ఉగ్గు పాల,
వసుధ యువకుల మానవ బాంబులుగను
మార్చు కొందరు  రాక్షసుల్  మరి పిశాచి
కన్న,  వారలు క్రూరులు కఠినులు గద!  



Wednesday 7 March 2012

నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 13-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్ 


అభిమానులు తెచ్చిన నెమలికన్నులను సినిమా హీరోయిన్ గుత్తులుగా పట్టుకున్నప్పుడు కనబడే దృశ్యాన్నిఊహిస్తూ ...

శార్దూలము :
నూరున్రోజులు దాటి పోయె తెలియ న్రుద్రాణి హీరోయినై
చేరన్ బృందము, 'ఫ్యాన్సు'లంచు నిడగా చేపట్టెగా ప్రీతితో
వారల్ దెచ్చిన పింఛముల్  గుబురుగా వక్షంబు పై గప్పగా
నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్. 

Tuesday 6 March 2012

చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 13-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

 సమస్య - చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

కందము :
తీరుగ వెన్నను దొంగిలు
పేరెన్నికగన్న దొంగ, పెట్టుము వెన్నన్
మారితి నేనని బొంకగ
చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

Monday 5 March 2012

బడబానల పంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 12-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - బడబానల పంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్  


కందము :
కడుపులె బానలవంటివి
ఉడుపులు గా గడ్డి చుట్టి  రుత్సవమది ' గ్రీ
నుడె' సందర్భముగా గన
బడ, బానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్

Sunday 4 March 2012

చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 12-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.




సమస్య -  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్


కందము :
కొమరయ్య నిన్న నొంటి  పొ
లమునకు కావలికి వెడలె, రాతిరి కలలో
యమ భటులే కను పించగ
చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్.

Saturday 3 March 2012

శాంతి విడిచి కనుడు సౌఖ్య ములను.

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 11-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - శాంతి విడిచి కనుడు సౌఖ్య ములను.

ఆటవెలది : 
శాంతి లేక మనకు సౌఖ్యమ్ము లేదని
త్యాగరాజు జెప్పె బాగు గాను
కాన మనసు నందు గప్పియున్నట్టి య
శాంతి విడిచి కనుడు సౌఖ్య ములను. 

Friday 2 March 2012

కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 11-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్


కందము :
భూమిని నిలుపగ  సినిమా
'కామిని' చిత్రమ్ము పరచ  కామిని యెదపై
పామట చరచర జేరగ
కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్.

Thursday 1 March 2012

భారతీయత మనకిదే భార మయ్యె

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 10-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


           సమస్య -  భారతీయత మనకిదే భార మయ్యె

తేటగీతి  :
'భారతీయత' లోనను పరగ భార
తీ కరుణయు మరి కలదు 'తీయత' నము
తీయ దనమును విడనాడి తిరిగి చూడ
భారతీయత మనకిదే 'భార' మయ్యె.