తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 30 June 2011

శంకరాభ(పూ)రణం - భీముడు భీష్ము జంపెనతి భీకరలీల.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.     

                   సమస్య : భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్

ఉ:రాముని శిష్యు డప్పుడు పరాక్రమమొప్పగ పోరు సల్పగా
    నేమియు పాలువోక మరి యెట్టుల జచ్చునొ తాత జెప్పగా
    భీముని తమ్ముడర్జునుడు వ్రేల్చె శిఖండిని ముందు నిల్పి, ఏ
    భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్?

Wednesday 29 June 2011

శంకరాభ(పూ)రణం - తాళి గట్టిన వాడె నీ తండ్రి.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.     


                      సమస్య : తాళి గట్టిన వాడె నీ తండ్రి యగును.


తే.గీ:  ఇల్లు  అలుకతో వీడెను యిరువదేండ్లు,
         తిరిగి వచ్చెను చూడుము తెలియ నిజము !
         అతడు ప్రేమించి, నాడు, మీ అమ్మ మెడను
         తాళి గట్టిన వాడె;నీ తండ్రి యగును !!

Monday 27 June 2011

శంకరాభ(పూ)రణం - కలమును త్యజియించి పొందె గవి .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ          

           సమస్య : కలమును త్యజియించి పొందె గవి యను పేరున్

కం: కలమును విడువను, కావ్యపు
      కల దీరెడు వరకు ననుచు గ్రంధము వ్రాసెన్!
      ఇలనొక్కడు,పిదప నటులె
      కలమును త్యజియించి, పొందె గవి యను పేరున్!!

Sunday 26 June 2011

శంకరాభ(పూ)రణం - దత్తపది : పూరి - వడ - దోశ - అట్టు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 -06-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ  
  

                   దత్తపది :  పూరి, వడ, దోశ, అట్టు - మహాభారతార్థంలో......


                       శ్రీ కృష్ణుడు అర్జునునకు చేసిన హిత బోధ...

తే.గీ :  సమరమందున వలెనదో శక్తి యుక్తి !
          వడలి పోకుమ ! చేయుము వారి వధను!
          పూరి గరచునె కౌంతేయ ! పులియు సహజ
          ధర్మ మట్టులె విడనాడి? ధర్మ మిదియె! 

Friday 24 June 2011

శంకరాభ(పూ)రణం - వరుడను నాకేల వధువు వలదనె ......

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ                    


    సమస్య : వరుడను నాకేల వధువు వలదనె నతడున్.
 
కం:  మరి!నాన్న!మీకు చెప్పక
       సరితను మనువాడినాను శంకరు గుడిలో
       మరియొక కన్యకు నేనా
       వరుడను?నాకేల వధువు?వలదనె నతడున్. 

Wednesday 22 June 2011

శంకరాభ(పూ)రణం - వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య : వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె

తే.గీ.  ప్రజలు మెచ్చగ నొకనాడు వలచి వచ్చె
        భరత భూమి ప్రధానియౌ భవ్య పదవి
        వాజపేయిని; శ్రీదేవి వలచి వచ్చె
        భర్త గానెంచి బోనీని బాలివుడున. 

Tuesday 21 June 2011

శంకరాభ(పూ)రణం - రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


          సమస్య :  రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్.


కం:  నీతలపున శివ రూపము
       ప్రీతిగ భావించి మిగుల ప్రేమతొ భక్తిన్
       ఏ తరువుకు, మరి పుట్టకు,
       రాతికి, వందనములిడ వరమ్ములు దక్కున్.

Saturday 18 June 2011

శంకరాభ(పూ)రణం - తల్లి తల్లి మగడు తాత కాదు .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                          సమస్య : తల్లి తల్లి మగడు తాత కాదు

ఆ.వె :  తల్లి తల్లి మగడు తాతయ తెలుగులో
           తాత అర్థ మిదియె తండ్రి యగును
           సంస్కృతమ్ము లోన చక్కగా జూచిన
           తల్లి తల్లి మగడు తాత కాదు.  


ఆ.వె :  అడుగు చుంటి చెపుమ , అమ్మమ్మ ఎవరౌను?
           తల్లి కెవరు మనకు తండ్రి యైన?
           తల్లి చెల్లి సుతుడు తాతయ్య మనకౌన?
           తల్లి తల్లి, మగడు, తాత కాదు. 

  ఆ.వె : సీత అవని సుతయె, శ్రీరాముడే హరి
          వసుధ భర్త అగును వాసుదేవు
          డరయ లవ కుశులకు ఆవిధముగ జూడ
          తల్లి తల్లి మగడు తాత కాదు.

Wednesday 15 June 2011

శంకరాభ(పూ)రణం - చెడు గుణముల తోడ శిష్టుడలరె .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                         సమస్య :  చెడు గుణముల తోడ శిష్టుడలరె


ఆ.వె:  చక్రి యెచ్చటైన చక్కగా జూచిన
          కాన వచ్చు ననుచు  ఘనుడు తెలిపె!
          అసుర పుత్రుడయ్యు హరి పాదముల భజిం
          చెడు గుణముల తోడ శిష్టుడలరె!

Monday 13 June 2011

శంకరాభ(పూ)రణం - మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                                  సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.


తే.గీ:   తమిళ తమ్ముళ్ళ తపనను తలచుకొనుము,
           మాతృ భాషాభిమానమ్ము మనకు ముద్దు
           నల్ల ముఖమును వేయకు; తెల్ల వారి
           మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.

తే.గీ:   తెలుగు భాషను బలుకగ తెగులటంచు
           ఆంగ్ల భాషను నేర్వగ నాత్ర పడుచు
           తేనె వదలుదు వదియేల? తెల్ల వారి 
           మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు. 

Sunday 12 June 2011

శంకరాభ(పూ)రణం - చంపక మాలలేల కడు జక్కని ఉత్పల మాల .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య: చంపక మాలలేల?కడు జక్కని ఉత్పల మాలలుండగన్

ఉ:  చంపకమాల లల్లితిని, చక్కగ ఉత్పల మాల-లల్లితిన్
     సొంపుగ రెండు పద్యములు చంపక, ఉత్పల-మాత పూజకై;
     చంపకమాల వాడినది,చంపక మందున దోష ముండెగా!
     చంపక మాలలేల?కడు జక్కని ఉత్పల మాలలుండగన్!

Friday 10 June 2011

శంకరాభ(పూ)రణం - రామ చరిత్రము చదువగ రాదు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య:  రామ చరిత్రము చదువగ రాదు కుమారా


కం:  కామము, క్రోధము తగ్గును!
       ప్రేమలు మదిలోన పొంగి పెంపగుచుండున్!
       వ్యామోహము నీ దరికే
       రామ చరిత్రము చదువగ; రాదు కుమారా!

Thursday 9 June 2011

శంకరాభ(పూ) రణం - కాంతా లోలుండె మోక్ష గామి .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                            సమస్య: కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్


కం:  అంతట, లోపల వెలుపల
        భ్రాంతుల విడనాడి, మిగుల భక్తిని లలితా
        చింతన జేసెడి, శ్రీ శివ
        కాంతా లోలుండె, మోక్ష గామి గనంగన్.  


కం:  కాంతల మరిగెను విడువక
       పంతముతో వేమన, మరి వైరాగ్యముతో
       వింతగ అంతయు విడిచెను;
       కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్.

Wednesday 8 June 2011

శంకరాభ(పూ)రణం - దిక్కులేనివాడు దినకరుండు. ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                                   సమస్య:  దిక్కులేనివాడు దినకరుండు


ఆ.వె:  తిమిర ములను బాప తిరుగుచుండెడి వాడు
          గ్రహ గతులను  తానె గరపు వాడు
          దిక్కు చూపు తానె, దిక్కులు తనకేల?
          దిక్కులేనివాడు దినకరుండు. 

Tuesday 7 June 2011

శంకరాభ(పూ)రణం - నాతలపై బాదములిడి నర్తింపదగున్. ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                        సమస్య: నాతలపై బాదములిడి నర్తింపదగున్.

కం:  ఓతండ్రి, కొడుకునెత్తుక
       ఆతల్పముపైపరుండి; అనియెను,' కన్నా!
       చూతము, పాడుచు ఆడుము,
       నాతలపై బాదములిడి నర్తింపదగున్'!

Monday 6 June 2011

శంకరాభ(పూ)రణం - భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య:  భాగ్యనగరమ్ము,హైదరాబాదు,కాదు



ఆ.వె: భాగమతి పేర వెలసిన పట్నమేది?
        నగరమైనట్టి ఆపట్న నామమేది?
        తమిళనాడుకు అది రాజధానియౌన?
        భాగ్యనగరమ్ము,హైదరాబాదు,కాదు.


 ఆ.వె: భాగ్యనగరిని చేయకు భాగములను
         హైదరాబాదుయొక్కరి హక్కుకాదు
         కొంతమందికి చెందిన స్వంత ఆస్థి
         భాగ్యనగరమ్ము హైదరాబాదు-కాదు. 


ఆ.వె:  భాగ్యనగరమ్ము హైదరాబాదు- కాదు
         అనకు మె పుడైన, చూడగ అందులోన
         తెలుగు ఉర్దులు ఒకచోట కలసి నట్లు
          హిందు ముస్లిములు కలసి ఉందురచట.

Friday 3 June 2011

శంకరాభ(పూ)రణం - మునికి క్రోధమ్ము భూషణమ్మనుట ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

               సమస్య:  మునికి క్రోధమ్ము భూషణమ్మనుట నిజము

తే.గీ:  పరగ వేదపఠన, నిష్ఠ  బ్రాహ్మణునకు,
         సతికి ధవసేవ సతతము,శత్రువు నట
         సమర మందున నెదిరించు సైనికోత్త
         మునికి క్రోధమ్ము, భూషణమ్మనుట నిజము.  

Thursday 2 June 2011

శంకరాభ(పూ)రణం - తల్లిని దండించువాడు ధన్యుడు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
  
 సమస్య:  తల్లిని దండించువాడు ధన్యుడు గదరా 

కం:  తల్లీ! తండ్రీ! అనుచును
        పిల్లల ప్రేమించుచుంద్రు పెద్దలు కానీ
       అల్లరి మించిన, తండ్రిని 
       తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!

కం: పిల్లలు, ఎవరైతేనేం ?
       పిల్లను, అది ఆడదైన, పిండమునాడే
       ఒల్లక హత్యను జేసే
      తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!

కం: తల్లిగ జూడక , కోడలి
       నొల్లకనే చంపివేసి నల్లిగ నెంచే
       కిల్లర్, వర్రెస్టు మహా
       తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!