తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 31 October 2011

కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 26-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

   
   సమస్య - కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్


కం: విడిగా సంబంధమ్ముల
       పడిపడి నే చూడలేను 'భయ్యా' యనుచున్
       ముడి పెట్టగ చినతమ్ముని
       కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.

Sunday 30 October 2011

దత్తపది - "కరణము - వరణము - తరణము - చరణము".

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 24-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


దత్తపది - "కరణము - వరణము - తరణము - చరణము". 
స్వేచ్ఛా ఛందము లో రాముని గుణ గణములు వర్ణన.


ఆ.వె: నరుల 'జీవరచన' నవ్య వ్యాకరణము
          ఆర్త జనుల రక్ష కావరణము
          రామచంద్ర స్వామి రమ్యమౌ చరణము
          భక్తు లెల్లరకును భవ తరణము.


 

Saturday 29 October 2011

దత్త పది - "బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 22-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


         దత్త పది - "బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"
                   విషయము:- పచ్చదనము పరిశుభ్రత.


ఆ.వె: తులసి కోట నింట తెలిసి పెంచగ వలె
         బాబు! మోహనమ్ము పచ్చ చెట్లు
         చుట్టు పట్ల పెంచ శోభనమా లీ
         బ్రహ్మ నందన నుతు భార్య నిలచు.

బ్రహ్మ నందన (నారద ) నుతుని(నారాయణుని ) భార్య (లక్ష్మి) తాండవిస్తుందని నా భావం.  

Friday 28 October 2011

భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 21-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య -  భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్


ఉ:  మామయు అత్తయున్ తనను మన్నన జేయుచు' చాక్లె టివ్వలే'
      దేమని కోపగించి మరి వెంటనె ' బుజ్జులు ' వారి చిత్రమే
      నామును దీసి గీసె గద నచ్చిన రీతిగ; గీసి చూడగా
     "భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్" 

Thursday 27 October 2011

దత్తపది - "కట్ట - మూరి - చంద్ర - శేఖరా!" రామాయణం ఇతి వృత్తంలో....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 20-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


 దత్తపది - "కట్ట - మూరి - చంద్ర - శేఖరా!" రామాయణం ఇతి వృత్తంలో....


తే.గీ: కట్ట సేతువు కోతులు కలసి, రామ
         మూరితి, హనుమ, సౌమిత్రి మొత్తమంత
         చంద్ర వదనకై కదలిరి ' జయ ఇన కుల
         శేఖరా!' యని యసురుల చేటు కొరకు.

Wednesday 26 October 2011

నరకిన దీపావళియే నరకాంతక కృష్ణ

               బ్లాగు వీక్షకులందరికీ
దీపావళి శుభాకాంక్షలు.
 శ్రీ మహా లక్ష్మ్యై నమః  
శ్రీ కృష్ణ శ్శరణం మమ


నరకుము మాలో పాపము
నరకుము దుర్బుద్ధి, చింత, నరకుము లేమిన్  
నరకిన దీపావళియే
నరకాంతక కృష్ణ ! నిన్ను నమ్మితి మదిలో !

Monday 24 October 2011

నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 19-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్


ఉ:  భీతిని లేక జేతురిల పెద్దల బోలిన గ్రద్ద,నక్కలే
     నీతిని పైకి జెప్పి జన నేతగ మారుచు' స్కాము' లెన్నియో
     జాతిని మేలుకొల్పి జనజాగృతి తోడుగ చూడ నిట్టి దు
     ర్నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్. 

Sunday 23 October 2011

"క, చ, ట, త, ప" అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 17-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య - "క, చ, ట, త, ప" అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి


ఆ.వె: వెలుగు లీను విశ్వ విభుడైన రాముని
         మోము జాబిలాయె, ముగ్ధ యైన
         మైథిలీ ముఖమ్ము మందమౌ వెన్నెల
         జల్ల, వేరు గాని జంట యైరి. 

Saturday 22 October 2011

దత్తపది - కంటే-వింటే-తింటే-ఉంటే

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 14-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


దత్తపది -  కంటే-వింటే-తింటే-ఉంటే రామాయణార్థంలో ఐచ్ఛిక ఛందస్సులో

            
మంధర కైక తో అన్న మాటలు...

 
కం:  వింటే! కైకా జెప్పెద
        కంటే నీకొడుకు భరతు ఘన పాలకుగా
        నుంటే తప్పే మున్నది
        తింటే నీ యుప్పు నేను, తెలిపితి వినుమా!
 

Friday 21 October 2011

దత్తపది - శ్రాంతి, కాంతి, భ్రాంతి, క్రాంతి

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 13-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


      దత్తపది - శ్రాంతి, కాంతి, భ్రాంతి, క్రాంతి - గాంధీ తాత గురించి


కం:  శాంతియహింసల గొని వి
        భ్రాంతిగ గొనితెచ్చె నాడు భారత ప్రజకున్
        క్రాంతిని, దాస్యపు నిశి లో
        కాంతిని, విశ్రాంతి లేక గాంధి విధాతై ! 

Thursday 20 October 2011

కైలాసము వీడి యీడ కాపురముంటే

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 12-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           సమస్య - కైలాసము వీడి యీడ కాపురముంటే


కం: వేళాకోళము లాడకు
       మేలాభువి నుండ గలము? మేలా ? తినగన్
       హాలా హలధర ' కల్తీ '
       కైలాసము వీడి యీడ కాపురముంటే ! 

Wednesday 19 October 2011

కానరారాతనికి సములైనవారు.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 10-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                 సమస్య -  కానరారాతనికి సములైనవారు


తే.గీ:  కలసి వచ్చిన హెచ్చగు కలిమి జూచి
         కనులు మూసుకు పోయెను గనుక నేడు
         కానరారాతనికి, సములైనవారు
         చిన్న వారలు, పెద్దలు, కన్న వారు. 

Tuesday 18 October 2011

జనకుని పెండ్లి యాడుమని జానకి కోరెను ....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 09-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - జనకుని పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై


జానకి అను నామె తన తండ్రి షష్టి పూర్తి మహోత్సవములో తల్లి తో చెప్పుచున్న మాటలు...

చం: గణనకు నర్వదేండ్లు గల  కాలము దొర్లెను నేటితోడ మా
       జనకుడు పుట్టి, నాడు నిను జట్టుగ పట్టెను తల్లి ! పట్టి నే
       నొనరగ నొక్క దాన, గన నోములు పండగ షష్టి పూర్తి లో
       జనకుని పెండ్లి యాడుమని, జానకి కోరెను ప్రేమ మూర్తియై. 

Monday 17 October 2011

రతి పతి సోదరుండు రతి రాజుగ వెల్గెను.....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 08-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         
                  సమస్య -  రతి పతి సోదరుండు రతి  రాజుగ వెల్గెను చిత్రమున్నదే

             ఒక పడతి తన చెల్లి 'రతిని' తన మరదికి జోడు కూర్చి మురియు సందర్భం ...

చం: అతి సుకుమారి యీలలన యల్లన సాగిన హంసలేడ్చుగా !
       అతనిని జూడ చుక్కలవి యాకస మందున నుండ నేర్చునా !
       హితముగ జోడు గూర్ప మరి హెచ్చెను శోభలు; నాదు చెల్లెలౌ
       రతి - పతి సోదరుండు; ' రతి, రాజుగ' వెల్గెను చిత్రమున్నదే? 

 

Sunday 16 October 2011

మానిని మానముం జెరచి మాన్యతఁ బొందె ......

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 06-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య - మానిని మానముం జెరచి మాన్యతఁ బొందె మహాత్ముడై భళా


ఉ:  వేనకు వేలు వర్షములు పెద్ద పతివ్రత యంచు మెచ్చు స
     మ్మానిత గాథ మార్చ, నది మానుము తప్పని చెప్ప విజ్ఞులే!
     మానక, నొక్క కావ్యమున మంచిని చెడ్డగ జూపి యందు నా
     మానిని మానముం జెరచి,మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!

Saturday 15 October 2011

గురువు ప్రాశస్త్యము .....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 03-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య - గురువు ప్రాశస్త్యము - వర్ణన.

ఆ.వె:  గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
         మించి నట్టి వాడు; మంచి నెపుడు
         నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
         నిలువ వలయు, వెలుగు నీయ వలయు. 

Friday 14 October 2011

కరులు హిమాచల హరులను కారించె.....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 02-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


            సమస్య -  కరులు హిమాచల హరులను కారించె భళా


కం:  అరె ! కాశ్మీరును పాక్ ము
       ష్కరులే దాటంగ నెంచ! గాంచి తరిమె, స
       త్వరమున; భారత రక్షా
       కరులు, హిమాచల హరులను కారించె భళా! 

Thursday 13 October 2011

గణపతి సుముఖుండు కాడు కాడు....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 01-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


        సమస్య - గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్

కం: గుణ రహితము, రంగుల ప్రాం
       గణముల విషపూ రితమ్ము ఘనముగ నుండే
       గణపతి ప్రతిమల పూజకు
       గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్!

Wednesday 12 October 2011

ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 31-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
 
           సమస్య -  ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్

కం:  ఆపతు లేవుర సతి ? సీ
        తా పతి పేరెవరికొప్పు ? తనయుని తండ్రే
        రూపము? సుత సుత ఏమౌ ?
        ద్రౌపది - రామునకు - భర్త - దౌహిత్రియగున్ ! 

Tuesday 11 October 2011

సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు .....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 30-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య -  సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్

ఉ: కార్యము దగ్గరాయె నని కాంతలు కన్నెలు వేగ వచ్చి కైం
     కర్యము చేయ, దేవళము కాంతులు చిమ్మగ మ్రుగ్గు పెట్టగన్
     పర్య వసానమిద్ది, యట బాగగు రంగుల చుక్క మ్రుగ్గులో
     సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్.

Monday 10 October 2011

తేనె రుచిని జూడ తీయగానే లేదు

శ్రీ చింతా రామకృష్ణారావు  గారి  "ఆంధ్రామృతం" బ్లాగునందు 29-08-2011 న 'తెలుగు భాషా దినోత్సవం'  సందర్భంగా నేను వ్రాసిన పద్యం.

                
                                  పద్య మాధుర్యం


ఆ.వె: తేనె రుచిని జూడ తీయగానే లేదు
         పటిక బెల్లమందు పసయె లేదు
         చెరకు రసము తీపి చెల్లుబాటుగ లేదు
         మధుర మాయె 
పద్య మదియె నాకు .

 

Sunday 9 October 2011

భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను...

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 27-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



            సమస్య - భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్


ఉ: ఏమియు తోచకున్న  గననిట్టుల మాటలు దొర్లు చుండు గా
    భామయు భామయున్ గలియ - " బాలుఁడు పుట్టెను సత్యభామకున్
    ప్రేమలొ కాలు జారగను! పెద్దగ హిట్టగు ' పిచ్చి' చిత్రమే!
    హేమము రేటు హెచ్చె! మరి హీటరు కుక్కరు కొంటి నిన్ననే" !

Saturday 8 October 2011

రంభకు తాళి కట్టె రఘురాముఁడు ......

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 26-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                 సమస్య -  రంభకు తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్


ఉ:  శంభుని విల్లు బట్టి తన శౌర్యము హెచ్చగ రెండు జేసె, నీ
      డింభకు డేమిజేయునని టెక్కులు బోయిన  రాజపుత్రులున్
      స్తంభము వోలె నిల్వ; దను జాధమ రావణు గూల్చుదౌ కథా
      రంభకు, తాళి కట్టె రఘురాముఁడు వేల్పులు సన్నుతింపగన్.

Friday 7 October 2011

రవణక్కలియాస్ రోజా.....పవి పూవుగ మారిపోయి....

శ్రీ చింతా రామకృష్ణ  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 25-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



             సమస్య - పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్.


కం:   రవణక్కలియాస్ రోజా
        సవరించుక మార్గము తన సౌఖ్యము కొరకున్
        రవణను పెండ్లాడెనుగా
       "పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్"

పవి = వజ్రాయుధము.

Thursday 6 October 2011

జయములు గలుగును, అరిషడ్వర్గములారును ఆరును.....

బ్లాగు వీక్షకులందరకు విజయ దశమి శుభాకాంక్షలు.


కం: జయములు గలుగును నిజముగ
       భయములు మరి తొలగి భోగ భాగ్యము లబ్బున్ 
       రయమున చదువులు వచ్చు, వి 
       జయ దశమిని దుర్గ గొలిచి శరణము వేడన్.
కం: దుర్గతి గలుగదు, జీవన
       మార్గము గన స్వర్గ మగును,మనసున అరిష 
       డ్వర్గములారును ఆరును,
       దుర్గను మది దలచి వేడ దురితము లగున్ .  
  


Wednesday 5 October 2011

శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్.

శ్రీ చింతా రామకృష్ణా రావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 24-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



      సమస్య - శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్


కం:  కరములు కరవైన లలన
        కర గ్రహణము చేతునంచొక వరుడు రాగా,
        కరములు మోడ్చెను జనకుడు
        శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్!

Tuesday 4 October 2011

మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు .......

శ్రీ చింతా రామకృష్ణా రావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 23-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   
                 సమస్య -  మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్


ఉ: మాటల జెప్పియెన్నికల మాయలు జేయుచు గద్దె నెక్కు; మో
     మాటము లెందుకయ్య, మది మానవ ! మానవ? వారి మెచ్చుటన్ !
     కోటలు గట్టు వారె ! మరి కూర్చుని మూటలు గట్టు వారె! హా!
     మాటలు తప్పువారె! బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్!
                              
                          శ్రీ చింతా వారి స్పందన


మ: హనుమచ్ఛాస్త్రి హృదంతరాళమును మాయాదౌష్ట్య దుర్మార్గులౌ
      మనుజుల్ చేసెడి మోసముల్, గనెడి సమ్మాన్యంబులున్, కల్చె. బా
      ధనువ్యక్తంబును చేసె నద్భుతముగా ధన్యాత్ముడీతండు.స
      జ్జన సంస్కారము పూరణంబు తెలిపెన్. సన్మాన్యుడీతండిలన్.

Sunday 2 October 2011

తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్

శ్రీ చింతా రామకృష్ణా రావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 20-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           సమస్య -  తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.


కం:   నెల నెల సాధన జేసెను
        కల పండగ నెంచి తాను కష్టము తోడన్
        ఇల గిన్నిస్ బుక్కెక్కగ
        తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్. 

Saturday 1 October 2011

కోడలు పైట తీసి మరి కోరెను మామను .....

శ్రీ చింతా రామకృష్ణా రావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 19-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య - కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్


                
                  మేనమామను పెండ్లాడిన భామ చీరెలు కొనడానికి వెళ్ళిన సందర్భం ....

ఉ:    "గాడిగ లేదు! చూడ కనకాంబర వర్ణము నాకు నచ్చెగా !
        చూడుము పట్టు చీర యిది! చూడుము కట్టిన చీర యందమున్ !
        వీడను దీని నేను! విను! వేడితి, మూల్యము నెంచ వద్దనెన్ "
        కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్!