తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 30 September 2011

ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె

శ్రీ చింతా రామకృష్ణ  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 18-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య - ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె

తే.గీ:  చిన్న తనమున సేవలు చేసి చేసి
          పెద్ద జేయగ; పదవుల వృద్ది నొంది
          ఎంతవాఁడైన, తన తల్లి కింత,  వాడె
          చేయ వలయును అలయక సేవ లెపుడు.

Thursday 29 September 2011

ఖరము శిఖరమయ్యె కవి కులమున.

శ్రీ చింతా రామకృష్ణ  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 17-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



                      సమస్య - ఖరము శిఖరమయ్యె కవి కులమున
.


ఆ.వె: 'ఖరము మీద నిలచె కమనీయ ముగ శివుడు'
          యను సమస్య నీయ నపుడె నేను
          వరుస వ్రాసి నాడ ' గిరి శిఖర' మనుచు
          'ఖరము శిఖరమయ్యె కవి కులమున'.

Wednesday 28 September 2011

పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్.

శ్రీ చింతా రామ కృష్ణ  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 16-08-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


      సమస్య - పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్

కం:  మిత్రునికై లిఖియించిన
       పత్రము నొక కోయ వాడు పట్టుకు వెళుచున్
       మిత్రుని రశ్మికి డస్సియు
       పత్రముతో ' కోయ' ఒరిగె వట భూరుహమున్.
కం:  చిత్ర మదేమియు లేదిల,
       చిత్రములో ' తెలుగు హీరొ ' చిత్ర విచిత్రం
       గా త్రెళ్లుచు శ్రీ యంత్రపు
       పత్రముతో కోయ, ఒరిగె వట భూరుహమున్!

Tuesday 27 September 2011

ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమ నేతల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


       
         సమస్య -  ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమ నేతల్


కం:  చేటును గలుగక, పాలన
       పాటవముగ జేతుమన్న పార్టీ వారిన్
       ఓటరు ఖాతరు జేయడు;
       ఓటుకు నోట్లిచ్చువారె యుత్తమ నేతల్! 

Monday 26 September 2011

యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ

తే.గీ:  నాటు, నీటులు ఓటుకు నోటు, వేటు
         ఉచిత స్కీములు గుప్పించి ఉచ్చు వేసి

         లాగుచుందురు నాయక రాక్షసు లరె!
         యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ! 

Sunday 25 September 2011

వేప చెట్టున గాసెను వెలగ పండ్లు .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 
               సమస్య - వేప చెట్టున గాసెను వెలగ పండ్లు .


తే.గీ:  వెలగ చెట్టు ప్రక్కన కరి వేప నాటి
         నేను బెంచితి పెరడున నీరు బోసి
         పెరిగి నేడవి, చిగురాకు వేసెను కరి
         వేప, చెట్టున గాసెను వెలగ పండ్లు. 

తే.గీ:  పెండ్లి యింటికి ముందున్న వేప చెట్టు
         పైన గట్టిరి చిరు లైట్లు పండ్లవలెను

         వేప పండ్లకు ప్రక్కన వెలుగు చుండ
         వేప చెట్టుకు గాసెను వెలగ, పండ్లు.

Saturday 24 September 2011

గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


          సమస్య - గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్

కం:  బీర్బలు,అక్బరు కథ సం
       దర్భసహిత వ్యాఖ్యల పతి దరి జేరి సతిన్
       గర్భము నిమురుచు జెప్పగ,
       గర్భంబున నున్న బిడ్డ గంతులు వేసెన్! 


                 సమస్య -  గర్భ మందు బిడ్డ గంతు లిడెను.


ఆ.వె:  ఆడ పిల్ల లోన  నైనచో  తొలగించు
          మనగ  తల్లి; యిట్టి మలిన జగతి
          పుట్టి 'మునుగు' కన్న, 'పుట్టి ముంచు' డనుచు
           గర్భ మందు బిడ్డ గంతు లిడెను.  

Friday 23 September 2011

నర సింహుండాగ్రహించి నరకుని జంపెన్...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

        
            సమస్య - నర సింహుండాగ్రహించి;నరకుని జంపెన్


కం:  వరబాలు దండ్రి జంపెను
       నరసింహుండాగ్రహించి;నరకుని జంపెన్
       హరి,హరి సంహా రకుడౌ
       వర గర్విత దుష్టులైన వారల కెల్లన్ ! 

కం:  నరపతి పుత్రిక లందర
       జెరబట్టిన నక్కబోలు  జిత్తుల మారిన్!
       హరి,కృష్ణుడు,యాదవ వర
       నర సింహుండాగ్రహించి;నరకుని జంపెన్!
 

Thursday 22 September 2011

పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


            
                 సమస్య - పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా


చం:  కలువల కళ్ళ జానకికి కంజదళాక్షుడు రామచంద్రుకున్
        చలువల పందిరేసిరట చక్కగ పెండ్లిని జేయుచుండె!రా!
        పిలువగ రారు నీ కడకు పేరును బెట్టుచు; రమ్ము రమ్మికన్!
        పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా! 

Wednesday 21 September 2011

శంకరాభ(పూ)రణం - రామ మూర్తి గన విరక్తి గలిగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 05 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                    సమస్య - రామ మూర్తి గన విరక్తి గలిగె


ఆ.వె:  అన్నకుశుడ! చూడు మాడుదానిని జంపె!
           చెట్టు నక్కి వాలి మట్టు బెట్టె!
           భార్య నొంటి నడవి పాల్జేసె గద!యిట్టి
           రామ మూర్తి గన విరక్తి గలిగె! 

Tuesday 20 September 2011

శంకరాభ(పూ)రణం - దత్తపది 'కల' - ఆ అర్థంలో కాకుండా నాలుగు పాదాలలో వచ్చేట్టు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య -  "కల" అనే పదాన్ని ఆ అర్థంలో ప్రయోగించకుండా 'త్రిజటాస్వప్న వృత్తాంతం.'
 


            త్రిజట జానకి తో పలికిన పలుకులు....

కం: కలవిక రోజులు మంచివి;
       కలకలములు రేగి లంక కాలును; పతితో
       కలయిక గల్గును  త్వరలో,
       కలతను వీడుమ! భవిష్య కాలము నీదే!


Monday 19 September 2011

శంకరాభ(పూ)రణం - చీర విడిచి వెడలె చిగురు బోడి...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                        సమస్య -  చీర విడిచి వెడలె చిగురు బోడి

ఆ.వె:   గుడికి వెడలి వచ్చి,వడివడి ఫలహా
           రమును తిన్న పిదప,రాత్రి కొన్న
           జీన్సు ప్యాంటు వేసి,సినిమాను జూడగ
           చీర విడిచి వెడలె;చిగురు బోడి. 

ఆ.వె:  అన్న వదిన తోడ,అదవికేగగ తాను
          కలికి ఊర్మిళ నట-గట్టి నార
          చీర-విడిచి వెడలె జిగురు బోడిని నాడు
          లక్ష్మణుండు సుగుణ లక్షణుండు.  

Sunday 18 September 2011

శంకరాభ(పూ)రణం - కప్ప దినెడి పాము కసవు మెసగె..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


               సమస్య -  కప్ప దినెడి పాము కసవు మెసగె

ఆ.వె:  దారి దోపిడీలు దారుణ హత్యలు
         మరగి నట్టి బోయ; మారె రామ
         నామ మహిమ కవిగ నాడు; విచిత్రమె!
         కప్ప దినెడి పాము కసవు మెసగె!  


ఈ మధ్య టి.వి.లో ఒక కార్యక్రమంలో చికెను ఇష్టంగా తింటున్న రామ చిలుకను చూపించారు.

ఆ.వె:  జనులు,జీవులన్ని 'జస్టుఫర్ ఛేంజని'
          వెజ్జు,నాను వెజ్జు 'ప్లేసు' మారె!
          చిలుక పండ్ల నొదలి చికెను దినదొడగె
          కప్ప దినెడి పాము కసవు మెసగె!

Saturday 17 September 2011

శంకరాభ(పూ)రణం - ఆవకాయ రుచుల నతివ రోసె...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                   సమస్య -  ఆవకాయ రుచుల నతివ రోసె


ఆ.వె:  ఆంధ్ర పడుచు వచ్చె నమెరికా నుండిటు
          అత్త గారి గ్రామ మచట జూడ
         ఆవకాయ రుచుల, నతివరో!సెహబాసు
         ఆహ!ఆహ! యనుచు నారగించె!  

ఆ.వె: ఆవకాయ పెడుదు నత్తగారికి పోటి!
         చూడు డనుచు పెట్టి,చూచె రుచిని
         మొదట తాను;నాడు మొదలు ముట్టననుచు
         ఆవకాయ రుచుల నతివ రోసె!

Friday 16 September 2011

శంకరాభ(పూ)రణం - బాబా యే భార్య తోడ భజనకు వెడలెన్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         
          సమస్య - బాబా యే భార్య తోడ భజనకు వెడలెన్



కం:   బాబానే నమ్మడు మరి
        మా బాలా పిన్ని మగడు, మహిమో!యేమో!
        వీబూది దాల్చి నేడిటు
        బాబాయే;భార్య తోడ భజనకు వెడలెన్! 

Thursday 15 September 2011

శంకరాభ(పూ)రణం - గడ్డము జేసికొమ్మనుచు గాంతుడు భార్యకు జెప్పె ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             
             సమస్య -  గడ్డము జేసికొమ్మనుచు గాంతుడు భార్యకు జెప్పె నవ్వుచున్


ఉ:  "బిడ్డలు ముగ్గురైరి!మన పిల్లల బెంచగ డబ్బు గావలెన్!
       చెడ్డది గాదు చూడగను, జేసెద నౌకరి నీకు తోడుగా!
      
డ్డము చెప్పబోకు"మన!మ్మడి చెంతకు జేరి ఎత్తుచున్
       గడ్డము; ' జేసికొమ్మనుచు ' గాంతుడు భార్యకు జెప్పె నవ్వుచున్! 

Wednesday 14 September 2011

శంకరాభ(పూ)రణం - పూలన్ దేవిని గొలిచిన బుణ్యము ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


  సమస్య - పూలన్ దేవిని గొలిచిన బుణ్యము దక్కున్


కం:  శ్రీ లలితా, పరమేశ్వరి,
       శైలజ, శ్రీకంఠు రాణి, చండిని ప్రాతః
       కాలము నందున తెల్లని
       పూలన్; దేవిని గొలిచిన బుణ్యము దక్కున్! 

Tuesday 13 September 2011

దత్తపది - అతి, గతి, చితి, పతి - బారతార్థం లో ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  దత్తపది - అతి, గతి, చితి, పతి -  బారతార్థం లో ...


ఆ.వె: అతివ జూచి నవ్వె నా మయ సభ లోన
          ఛీఛి!చావ దగును చితిని పేర్చి!
          ఐదు మంది పతుల యాపతివ్రత దు
          ర్గతిని చూడక కురు పతిని గాను! 

సంధికి రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు ధృతరాష్ట్రునితో...

కం:   గతి నే సంధికి వచియిం
         చితి నిటు కురురాజ నీవు చేయుము, లేదో!
         పతితులు నీశత సుతుల
         య్యతివ నెడ సలిపినపాప మంతము జేయున్!  

Monday 12 September 2011

శంకరాభ(పూ)రణం - నీటి లోన బుట్టె నిప్పు గనుడు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 04 - 2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - నీటి లోన బుట్టె నిప్పు గనుడు


కం:  ముంచె సంద్ర మంత భూకంపములు వచ్చి
       రేడియేష నందరే!జపాను
       సోలు చుండె నేడు శోకాగ్నిలో తాను
       నీటి లోన బుట్టె నిప్పు గనుడు!! 


Sunday 11 September 2011

శంకరాభ(పూ)రణం - చందమామ గన నసహ్య మయ్యె ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                    సమస్య -  చందమామ గన నసహ్య మయ్యె

ఆ.వె:   చూడ కన్నులేమొ సూర్య చంద్రులాయె
           మోము వెలుగు బోల్చ నేమి లేదు!
           అమ్మవారి ముందు నంబరమందలి
           చందమామ గన నసహ్య మయ్యె!!  



ఆ.వె:   గుట్క,ఖైని నమల గొంతు క్యాన్సరొచ్చె
            మాను మనిన మంచి మాట వినక!
            ఆసుపత్రి జేరి అలమటించు శర
            చ్చందమామ గన నసహ్య మయ్యె!!

Saturday 10 September 2011

శంకరాభ(పూ)రణం - పిట్ట పిట్ట పోరు పిల్లిదీర్చె ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                    సమస్య - పిట్ట పిట్ట పోరు పిల్లిదీర్చె


ఆ.వె:  పిట్ట,పిల్లి వాటి పిల్లలతో పోరి
          బైట కలసి మిగుల బాధ పడెను!
          నచ్చ జెప్పి పిదప నాపిల్లి పోరును
          పిట్ట; పిట్ట పోరు పిల్లి; దీర్చె!! 

Friday 9 September 2011

శంకరాభ(పూ)రణం - సంజీవని దెచ్చి యిచ్చి చంపగ సాగెన్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



               సమస్య -  సంజీవని దెచ్చి యిచ్చి చంపగ సాగెన్


కం:  ముంజెను తెచ్చిన  రీతిగ
       సంజీవని దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్
       కుంజర శతశత బలమున
       నంజన సుతుడపుడు పోరి యసురుల తోడన్! 

Thursday 8 September 2011

శంకరాభ(పూ)రణం - నారాయణ యనిన వాడు నవ్వుల పాలౌ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - నారాయణ యనిన వాడు నవ్వుల పాలౌ



       (భూకైలాస్ లో అక్కినేని - నారదుని పాత్ర అద్భుతంగా చేశారు..)


కం:  'నారాయణ' నుచు చక్కగ
      'నారదుడుగ' పాత్ర వేసె 'నాగేశ్వర్రావ్'!
      'బోరని' యెవడే మన్నను
      'నారాయణ!'   యనిన వాడు నవ్వుల పాలౌ !  

Wednesday 7 September 2011

శంకరాభ(పూ)రణం - చైత్రపు శోభలన్ గన నసహ్యము గాదె ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య - చైత్రపు శోభలన్ గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్


ఉ:  చిత్రమదేమి  లేదు మరి చిత్తము పొంగుర  యేరికైన నా
      చైత్రపు శోభలన్ గన; నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
      చిత్ర విచిత్ర శబ్దముల చీదర కూతల పిచ్చి గంతులన్
      చిత్రణ జేసి గీతముల, చిత్రములందున జూపుచుండినన్.  

Tuesday 6 September 2011

శంకరాభ(పూ)రణం - కల్లలాడు వాడె ఘనుడు భువిని ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                           సమస్య - కల్లలాడు వాడె ఘనుడు భువిని

ఆ.వె :  మనసు నందు కరుణ,మంచితనము గల్గి;
           కూడు, గూడు, గుడ్డ, తోడు నీడ
           లేని వారి జూడ;పూని సాయ పడుట
           కల్లలాడు వాడె, ఘనుడు భువిని. 

Monday 5 September 2011

శంకరాభ(పూ)రణం - నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


    సమస్య - నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్


కం:  వినువీధుల వెదకితి మిము
       కనుగొన;సప్తర్షులార! గాలి ప టంలా
       ఘనముగ నుండగ జూచితి
       నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్! 

           నా, నానా  ' ' కార పద్యం 

కం
:     నీ నాన్నే నన్ననెనా?
         నేనే నీ నాన్న నైన నిన్ననినానా?*
       *నీ నాన్నన్నను నేనే!
        నానీ!నీ నాన్న నాన్న నానాన్నేనే
!
 

*(నిన్న+అనినానా)
*(
నీ నాన్న+అన్నను) 

Sunday 4 September 2011

శంకరాభ(పూ)రణం - వదినను ముద్దడిగె మఱది పదుగురు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


            సమస్య - వదినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్

కం :  ముదముగ పుట్టిన రోజున
        పది యేడులు నిండ, వదిన పార్థుని కొరకై
        పదపడి నిడ లడ్డును,కో
        వ; దినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్!  


కం :  కదలను నడకను బడికన,
        వదలకనే ముద్దు జేసి వాహనమున తా
        వదలిన; మూతిని ముడుచుచు
        వదినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్!

Saturday 3 September 2011

శంకరాభ(పూ)రణం - మగని మోసగించు మగువ సాధ్వి ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                    
                     సమస్య - మగని మోసగించు మగువ సాధ్వి



ఆ.వె :  మగడు దూర దేశ మందు తానుండంగ
           కాముకుండు జేరి కథలు జెప్ప;
           లొంగి పోక వాని లోగుట్టు, దొంగ ప్రే
           మగని, మోసగించు మగువ సాధ్వి!
 

Friday 2 September 2011

శంకరాభ(పూ)రణం - గోమాంసము దినెడి వాడె గురువన ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


         సమస్య - గోమాంసము దినెడి వాడె గురువన నొప్పున్

కం:  గోమాయు వనగ  నొప్పును
        గోమాంసము దినెడి వాడె; గురువన నొప్పున్
        క్షేమముగా భూజనులకు
        నీమములను బోధజేసి నిష్ఠను మెలఁగన్ !  

Thursday 1 September 2011

(21 ) పత్రి పేర్లను గలిగిన పద్యమిదియె .....

                      ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 

                    వీక్షకులందరకు వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఆ.వె :  విఘ్న నాధు  గొలువ  విద్యలే గలుగును 
           విద్య వలన సకల విభవ  మొదవు !
           వక్రతుండు గొలువ సక్రమంబగు బుద్ది 
           గలిగి నరుడు భువిని యలర గలడు !!

అందరకు   గణేశ చతుర్థి శుభాకాంక్షలు. ఏ విషయాన్నయినా చందోబద్దంగా చెప్పటం మన సంప్రదాయం. 
అలా ఛందో బద్దంగా ఉన్నవాటిని నేర్చుకున్నప్పుడు ఎప్పటకీ మరచి పోము.. చిన్నతనం లో మా తల్లిదండ్రులు  
నేర్పిన ఒక పద్యాన్ని ప్రచురిస్తున్నాను.ఇది నేర్చుకున్న వారికి వినాయకుని పూజకు ఉపయోగించ వలసిన ఏకవింశతి (21 ) రకముల పత్రి పేర్లు కరతలామలకము లౌతాయి. ఈ తరం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇస్తున్నాను. ఏమైనా దోషములు, సవరణలు వుంటే విజ్ఞులు, పెద్దలు సూచించినచో సరిదిద్ద గలవాడను. 
ఇది సంప్రదాయంగా పెద్దలు చెప్పుచున్న పద్యం . మూలము, రచయిత పేరు తెలియదు.

సీ :  సిద్ధి వినాయకా ! నిన్ను ప్రసిద్ధి గా పూజింతు
                             నొనరంగ నిరువది యొక్క పత్రి !
      దానిమ్మ, మరువము, దర్భ, విష్నుక్రాంత, 
                              ఉమ్మెత్త, దూర్వార, ఉత్తరేణి, 
     గరికయు, మారేడు, గన్నేరు, జిల్లేడు, 
                            దేవకాంచన, రేగు, దేవదారు,
       జాజి, బల్రక్కసి, జమ్మి, ఆవల తుమ్మి,
                          మాచి పత్రియు, నారె, మంచి మునగ,

తే.గీ :      అగరు గంధమ్ము కురువేరు అక్షతలును
               ధూప దీపమ్ము నైవేద్య 
*హారతులను  
               భాద్రపద శుధ్ధ చవితిని  పట్ట పగలు    
               కోరి  పూజింతు
నిను నేను కోర్కె దీర !    


(* యతి భంగము -సరి యగు పదము తెలిసిన విజ్ఞులు తెలుపగలరు )