తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 31 July 2011

శంకరాభ(పూ)రణం - భల్లూకము చదువుకొనగ బడిలో జేరెన్...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

           సమస్య: భల్లూకము చదువుకొనగ బడిలో జేరెన్

కం:   చల్లా,అల్లం వారలు
        పిల్లల్నే ముద్దుపేర్ల పిలుతురు; వారే
        లల్లీ,పప్పీ,బంటీ,
        భల్లూకము; చదువుకొనగ బడిలో జేరెన్!

Saturday 30 July 2011

శంకరాభ(పూ)రణం - మందు జనుల కెల్ల విందు గాదె .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                           సమస్య :  మందు జనుల కెల్ల విందు గాదె

ఆ.వె:  బంధ మున్న వారు బంధుజనులు గాన
          మందు త్రాగు వారు మందు జనులు,
          సబ్సిడీల నిచ్చి సారాయి పోసిన
         'మందుజనుల ' కెల్ల విందు గాదె! 

Friday 29 July 2011

శంకరాభ(పూ)రణం - శ్రీరాముని జూచి సీత ఛీ కొట్టె....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య :  శ్రీరాముని జూచి సీత ఛీ కొట్టెగదా

కం:  ఆ రావణుడరుదెంచగ,
       మారాడక గరిక బట్టి మధ్యన, యెన్నో
       మారులు మది దలచి తలచి
       శ్రీరాముని; జూచి సీత ఛీ కొట్టెగదా! 

Thursday 28 July 2011

శంకరాభ(పూ)రణం - నరసింహుని పూజ చేసె నరకాసురుడే.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

             సమస్య : నరసింహుని పూజ చేసె నరకాసురుడే

కం:  నరరూప రాక్షసుండే, 
       నరులను తా డబ్బు కొరకు నరికెడి ఘనుడే!
       నర ఘోష తీర వలెనని
       నరసింహుని పూజ చేసె నరకాసురుడే!! 

Wednesday 27 July 2011

శంకరాభ(పూ)రణం - పోలేరమ్మను నుతింప ముప్పు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                సమస్య : పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా

(ఈ మధ్య కొన్ని భక్తి గీతాలు వింటుంటే మూలంలోని పాట గుర్తుకు వస్తుంది తప్ప భక్తి భావం గలుగదు.భక్తి లేని నుతులు ముప్పు అని నా భావం) 


కం :  'లేలే నారాజా',మరి
        'లేలేరా తిరగబడుము' లెమ్మను,పాటల్
         మేలేయని పేరడితో
         పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!

Tuesday 26 July 2011

శంకరాభ(పూ)రణం - అవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

               సమస్య :  అవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్

మ: కవనోత్సాహము గల్గజేసి గురువుల్ కౌశల్యమే బెంచగా,
      శివసంకల్పము ధారణే సలుపగా, శ్రీ భారతీ సత్కృపన్
      లవ లేశంబును తొట్రు పాటు పడకన్ రంజింపజేసెన్ గదా
      అవధానం బొనరించి, పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

Monday 25 July 2011

శంకరాభ(పూ)రణం - వన్నెలే తెల్లబోయిన వింత గనుడు..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య :  వన్నెలే తెల్లబోయిన వింత గనుడు

తే.గీ :  పంచ వన్నెల చీరెను పట్టుకొచ్చి
         భార్య కిచ్చితి, పండుగ బహుమతిగను!
         కాల మేమందు? ఒకసారి కట్టి, ఉతుక
         వన్నెలే తెల్లబోయిన, వింత గనుడు! 

Sunday 24 July 2011

శంకరాభ(పూ)రణం - తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                      సమస్య :  తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు

తే.గీ : చూడ తిట్టగు "రా" యన్న; చోద్య మదియె!
         భక్తియుప్పొంగ నార్తితో  భజన సలిపి
         ఆదు కొనుము 'రా'!యీయ'రా'! అభయ మనుచు
         తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు !!

Wednesday 20 July 2011

శంకరాభ(పూ)రణం - సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


          సమస్య :  సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్

కం : సింహళ జట్టును జూడగ
       సింహమె క్రిక్కెట్టునందు, చిన్నది  కెన్యా !
       'సంహౌ'గెలిచిన - అనెదము
       సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్!!



        సమస్య :  సింహమును జయించెను గ్రామ సింహ మొకటి


తే.గీ :  బొమ్మ కథలను వేసెడు పొత్తమందు
        "కండ బలము నధిగమించఁ గలదు తెలివి"
         అనుచు చెప్పెడు కథ గంటి, నందులోన
         సింహమును జయించెను గ్రామ సింహ మొకటి.

Tuesday 19 July 2011

శంకరాభ(పూ)రణం - మాధవుడు మాధవుని తోడ మత్సరించె..

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య :  మాధవుడు మాధవుని తోడ మత్సరించె

తే.గీ :  లింగ రూపము నందున లీల జూపి
         ఆది యంతము  లేకుండ నట్లె నిలువ
         మొదలు గానక నప్పుడు మ్రొక్కె; ఎపుడు
         మాధవు  డుమాధవుని తోడ మత్సరించె?  

Monday 18 July 2011

శంకరాభ(పూ)రణం - నెల వంకన్ జూచి నవ్వ నేరము .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

            సమస్య : నెల వంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ

కం:  విలువగు ప్రేమకు అర్థము
       తెలియకనే; ఒళ్ళు బలిసి తెలుపుచు గొప్పల్!
       వలపుల పేరున నిటు క
       న్నెల వంకన్ జూచి నవ్వ, నేరము సుమ్మీ! !

Sunday 17 July 2011

శంకరాభ(పూ)రణం - శ్రమము నందు మనకు శాంతి దొరకు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య : శ్రమము నందు మనకు శాంతి దొరకు

ఆ.వె : దేహ వాంఛ  వదలి, దేవుని ధ్యానంబు
          సతత మచట సలిపి, సాధకులకు
          నుచిత రీతిని, తగు యుద్బోధ జేయునా
          శ్రమము నందు మనకు శాంతి దొరకు!


ఆ.వె : ఆడ పిల్ల 'శాంతి ' నారు యేండ్ల క్రితము
          వదలి వెళ్ళినాము వలదననుచు!
          మనసు మారె నిపుడు, మాత సులక్షణా
          శ్రమము నందు; మనకు "శాంతి" దొరకు!!

Saturday 16 July 2011

శంకరాభ(పూ)రణం - అర్జునునకు మిత్రు డంగ రాజు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                            సమస్య :  అర్జునునకు మిత్రు డంగ రాజు

ఆ.వె :  "కదన మందు నేను కాలుని గానౌదు
             నర్జునునకు" - మిత్రు డంగ రాజు
             బాస చేతు ననుచు బాహాటముగ జెప్పె
             రాజరాజు కపుడు రాజ సభను. 

Friday 15 July 2011

శంకరాభ(పూ)రణం - బావా రమ్మని పిల్చె మోహ మెసగన్ బాంచాలి .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య :  బావా రమ్మని పిల్చె మోహ మెసగన్ బాంచాలి రాధాత్మజున్

శా : ఈవేళన్! మరి ప్రేక్షకాదరణకై! ఇవ్వాలి 'డ్రీంసాంగు' నే !
       ఏవో! ఓ తగు చిన్నమార్పు లిడుచున్!ఈ కర్ణ చిత్రంబులో
       ఓ వాటంబగు పాట!యంచు కలిపెన్నూహించి; ఆపాటలో
       బావా!రమ్మనిపిల్చె మోహమెసగన్ బాంచాలి రాధాత్మజున్!! 

Thursday 14 July 2011

ముంబాయి పై ఘాతుకం .. సంతాపం ..

ముంబాయి నగరంలో జరిగిన వరుస ప్రేలుళ్ళ లో మృతి చెందిన, క్షతగాత్రులైన వారికి సంతాపాన్ని సానుభూతిని ప్రకటిస్తూ ......

                                           సంతాపం

తే.గీ :  పొంచి ముంబాయి నగరాన పోటు పొడిచి
          ముంచి నారయ్యొ! నెత్తుటి ముద్ద లోన;
          నరకు మించిన వారిని నరుకు వారు
          నరుల లేరయ్య, రావయ్య నార సింహ!

Wednesday 13 July 2011

శంకరాభ(పూ)రణం - ధనమె లక్ష్య మగును తాపసులకు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                      సమస్య :  ధనమె లక్ష్య మగును తాపసులకు

ఆ.వె :  ధనము, దార, పుత్ర, దాయాదు లందున
           నితర భోగ మనిన నిచ్ఛ నిడరు,
           స్వార్థ చింత లేక, సతతము మోక్ష సా
           ధనమె లక్ష్య మగును తాపసులకు.

Tuesday 12 July 2011

శంకరాభ(పూ)రణం - విగ్రహముల పైన నాగ్రహమ్ము .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య : విగ్రహముల పైన నాగ్రహమ్ము

ఆ.వె : నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
          విగ్రహముల పైన నాగ్రహమ్ము!
          విగ్రహముల? కావు? విజ్ఞత తోజూడ
          తాత,తాతతాత,తనువు లవియె!

ఆ.వె : నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
          విగ్రహముల పైన నాగ్రహమ్ము!
          నీదు తాత,మామ,స్నేహితుండును,భార్య
          ఆంధ్ర వారు కాగ అపుడు యెటుల?

ఆ.వె : నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
          విగ్రహముల పైన నాగ్రహమ్ము!
          చదువు నేర్పి బుద్ధి చక్కదిద్దిన ఒజ్జ
          నేమి జేతు వాంధ్ర నేల కాగ ? 

Monday 11 July 2011

శంకరాభ(పూ)రణం - విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

              సమస్య : విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్. 

కం:  చూస్కో! ముల్లును ముల్లు
        తీస్కో వచ్చును; విషమది తెలియగ విస్కీ!
        రాస్కో! ఆ  విధముగనే
        విస్కీయే మేలు, విషము విఱుగుట కొఱకున్!!

Sunday 10 July 2011

శంకరాభ(పూ)రణం - మెల్ల కన్ను వలన మేలు కలిగె .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                        సమస్య :  మెల్ల కన్ను వలన మేలు కలిగె. 


ఆ.వె :  బలినొసంగ నెంచి మాంత్రికుండొక్కడు
           మాటు వేసి పట్టి 'మంగ పతిని'
           వాని కళ్ళు చూచి, వదలెను వలదని
           మెల్ల కన్ను వలన మేలు కలిగె. 

Saturday 9 July 2011

శంకరాభ(పూ)రణం - దున్న పాలు పితికె సుందరాంగి .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య :  దున్న పాలు పితికె సుందరాంగి. 

ఆ.వె:  పాలు లేవు యింట! పాపాయి కిప్పుడు
         యెటుల? అనుచు నమ్మ యెదురు చూచె;
         ప్రొద్దు పోయి రాగ  పొలము జనిన గేదె,
         దున్న, పాలు పితికె సుందరాంగి.  

ఆ.వె:  పట్న వాసి యొకతె పల్లెటూరుకు వచ్చి
         ఆచట పితుకు చుండ అత్త పాలు;
         'నే' ననంగ , అత్త నిలుచుని గేదెముం
         దున్న, పాలు పితికె సన్నుతాంగి.

Friday 8 July 2011

శంకరాభ(పూ)రణం - ఆడు వారిని తన్నుటే న్యాయ మగును

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య: ఆడు వారిని తన్నుటే న్యాయ మగును

తే.గీ:  బ్రతుకు తెరువుకు వచ్చిన పడతుల తన
          అమ్మ, చెల్లాయి,నక్కయ్య,నాత్మ మరచి
         
ఆట బొమ్మగ భావించి, అమ్ము కొనుచు
          ఆడు వారిని; తన్నుటే న్యాయ మగును. 

Thursday 7 July 2011

శంకరాభ(పూ)రణం - పెండ్లి సేయ దగును ప్రేత మునకు.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                          సమస్య:  పెండ్లి సేయ దగును ప్రేత మునకు.    


ఆ.వె:  మాట వినని యెడల మరియొక విధమున
        ' పెండ్లి'జేతు మంద్రు పెద్ద లెపుడు;
         అంటి పెట్టు కొనుచు హడల గొట్టుచు నుండ
        ' పెండ్లి' సేయ దగును ప్రేత మునకు. 

Wednesday 6 July 2011

శంకరాభ(పూ)రణం - కాశి కేగు వాడు ఖలుడు.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                        సమస్య :  కాశి కేగు వాడు ఖలుడు గాడె.

 
 ఆ.వె : ఈశు ధ్యాసను మది నింతైన దలుపక
           క్షేత్ర మహిమ దరికి  చేర నీక 
           తీర్థ యాత్ర గాక, స్వార్థయాత్ర కొరకు
           కాశి కేగు వాడు ఖలుడు గాడె.

Tuesday 5 July 2011

శంకరాభ(పూ)రణం - తుందిలుని గని మన్మథుడని తొయ్యలి .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

 సమస్య:  తుందిలుని గని మన్మథుడని తొయ్యలి మురిసెన్

కం:  ఇందుధరు నింతి, ముద్దిడి
       మందగమను శూర్పకర్ణు మాతంగ ముఖున్ !
       చిందులు వేయుచు తిరిగెడి
       తుందిలుని గని, మన్మథుడని తొయ్యలి మురిసెన్ !!

Monday 4 July 2011

శంకరాభ(పూ)రణం - మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

           సమస్య: మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

కం:   'గుడిగంట ' నాటకంబున
         గుడిలో పూజారి పాత్ర 'గోపడు 'వేసెన్!
         సడి లేక మధ్య మధ్యన
         మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్!!


కం:  చెడు తిరుగుడు తిరిగెడు యొక
        గుడి అర్చకు చిన్న కొడుకు, కూడలి నడువన్
        పడి పడి నవ్వి జనులనిరి
        "మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్."

Sunday 3 July 2011

శంకరాభ(పూ)రణం - హర,హర,శంకరా,యనుచు నాలిని కౌగిట జేర్చె.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  సమస్య :  హర,హర,శంకరా,యనుచు నాలిని కౌగిట జేర్చె బ్రేమతో.

ఒకప్పుడు భార్యపై శంకతో కొట్టిన భర్త తప్పు తెలుసుకొని చేరదీసిన సమయంలో
అన్న మాటలు.అతనికి హరా! అనటం అలవాటు.

చం:  కొరకొర జూచి కొట్టితిని కోపము తోడను శంకతో, హరా!
       చరచర ఈడ్చినాను నిను చావిడి బైటకు నాడు, నేటితో
       పొరలవి వీడి పోయినవి పొల్పుగ, నీయెడ యెంచనెప్పుడున్
       హర!హర! శంక; రా!యనుచు నాలిని కౌగిట జేర్చె బ్రేమతో. 

Saturday 2 July 2011

శంకరాభ(పూ)రణం - శిష్టు డెట్లు పల్కు శివ శివ యని.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
     
                     సమస్య :  శిష్టు డెట్లు పల్కు శివ శివ యని

ఆ.వె :  హరికి భక్తు డయిన, ఆ వశిష్టాచారి
           హరుని నామ మొల్ల డనవరతము;
           శివుని రాత్రి నాడు చెప్పిచూచిననా వ
           శిష్టు డెట్లు పల్కు శివ శివ యని?

Friday 1 July 2011

శంకరాభ(పూ)రణం - శంకరుం డొసంగు సంకటములు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 1 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.      

                   సమస్య : శంకరుం డొసంగు సంకటములు

ఆ.వె:  శంక లొదలి మదిని సద్బుద్ధి గొల్చిన
          శంకరుం డొసంగు; సంకటములు
          దీర్చి దరిని జేర్చి,దేహయాత్రను జేయ
          చాలినన్ని సిరులు సౌఖ్యములను.