తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 27 May 2011

శంకరాభ(పూ)రణం - అమ్మను పెండ్లియాడి ముదమందెను పుత్రుడు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 -02 -2011 న ఇచ్చిన వారాంతపు  సమస్యకు నా పూరణ.

సమస్య:  అమ్మను పెండ్లియాడి ముదమందెను పుత్రుడు, తండ్రి మెచ్చగన్


ఉ: అమ్మగమారె పుత్రుగని; ఆనక భర్తను గోలుపోయె; నీ
     విమ్ముగ భావి జీవితము నిమ్మని; యిచ్చెదనాస్తి నంచు నా 
     యమ్మడి తండ్రి వేడుకొన; నాదరమొప్పగ వ్యక్తి యొక్కడా
     అమ్మను,పెండ్లియాడి ముదమందెను-పుత్రుడు, తండ్రి మెచ్చగన్.

Thursday 26 May 2011

శంకరాభ(పూ)రణం - చీర గట్టెను పురుషుండు సిగ్గు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                సమస్య:  చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.


తే.గీ:  వనితలిర్వురు కొనరాగ వస్త్రములను
          సేల్సు మ్యానట జూపుచు చీరనొకటి;
          కట్టనిటులుండు, నన్నిటు గాంచుడనుచు
          చీర గట్టెను పురుషుండు, సిగ్గు పడక.

Wednesday 25 May 2011

శంకరాభ(పూ)రణం - నను నుతియించెడి జనులకు నవనిధులు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

           సమస్య: నను నుతియించెడి జనులకు నవనిధులబ్బున్


కం:  తనువున వసనము లేకనె
        తనసతినే అన్నమడుగు తాపసి,భిక్షున్,
        మనసిజు వైరిని,యెపుడై
        నను, నుతియించెడి జనులకు నవనిధులబ్బున్.

Tuesday 24 May 2011

శంకరాభ(పూ)రణం - మాఘమందున స్నానమ్ము మరణ మొసగు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
           



 సమస్య: మాఘమందున స్నానమ్ము మరణ మొసగు


తే.గీ.  బద్ధకమునకు మరి భవ బంధములకు
        మాఘమందున స్నానమ్ము మరణ మొసగు
        మాఘ మాసపు పూజల మహిమ వలన
        శ్రీహరి దయను కోరిన సిరులు గలుగు.

Saturday 21 May 2011

శంకరాభ(పూ)రణం - పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -02 -2011 న ఇచ్చిన వారాంతపు  సమస్యకు నా పూరణ.
   
                 సమస్య:   పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.        

చం:  గతులనుదప్పి, శుంఠలయి, గాడిదలై చరియించుచుండె,స
         న్మతియును,భక్తి,బాధ్యతలు మచ్చుకు లేకనె రామ!రామ!నా
         సుతులకు బుద్ధి,జ్ఞానములు సొంపుగ నిమ్మని,తండ్రి జానకీ
         పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.

Thursday 19 May 2011

శంకరాభ(పూ)రణం - రంగవల్లి యుద్ధరంగ మయ్యె.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
           
                        సమస్య:  రంగవల్లి యుద్ధరంగ మయ్యె.

ఆ.వె:  'రంగ ' డడిగె వంద రమ్మును త్రాగంగ
           ఒల్ల ననియె భార్య 'వల్లి ' యపుడు
           ఊరి వారి నడుమ పూరి గుడిసె ముందు
           రంగ-వల్లి, యుద్ధ రంగ మయ్యె. 

ఆ.వె:   అతివలంత గూడి ఆవూరి కూడలి
            మ్రుగ్గు లేసి తాము మురియుచుండ,
            తంద నాలనాడ    త్రాగుబోతులు వచ్చి
            రంగవల్లి యుద్ధ రంగమయ్యె. 

ఆ.వె:   మంత్రగాడు యొకడు మంచి మ్రుగ్గులు వేసి
            దయ్యము నట జేర తాను బిలిచె
            భూత మాంత్రి కునకు భూతమ్మునకుగూడ
            రంగవల్లి యుద్ధరంగ మయ్యె. 

Tuesday 17 May 2011

శంకరాభ(పూ)రణం - గానము వినినంత ఖరము గంధర్వు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


సమస్య:  గానము వినినంత ఖరము గంధర్వుడగున్
 
కం:  ఔనిందున వింతేమిటి?
        గానములో ఘంటసాల గంధర్వుడెగా!
        వీనుల విందగు ఆయన
        గానము వినినంత, ఖరము గంధర్వుడగున్!


                       (భ్రమర కీటక న్యాయముగా) 

Monday 9 May 2011

శంకరాభ( పూ)రణం - భార్య పాదంబులకు మ్రొక్కి భర్త ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య:  భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

తే.గీ:   మెట్టెలను నెటతొడుగు చేపట్టు వాడు?
          కోర్కెనెట్టుల పరమేశు కోరవలయు?
          ఇంతి గర్భమ్ము దాల్చిన నెవరు మురిసె?
          భార్య పాదంబులకు - మ్రొక్కి- భర్త మురిసె. 

తే.గీ:   భార్య కోపము చల్లార్చ భర్త యొకడు
          భామ యలుకదీర్పగ పట్టె పాదములను
          కృష్ణు కంటెను మనమేమి గొప్ప యనుచు
          భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె! 

Thursday 5 May 2011

శంకరాభ(పూ)రణం - చేయవలయు గురువు శిష్య పూజ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

               సమస్య:  చేయవలయు గురువు శిష్య పూజ.
    
ఆ.వె:   "లక్ష్మి పూజ నిపుడు లక్షపూవులతోడ
            చేయవలయు" గురువు "శిష్య! పూజ
            కొరకు తగిన పూలు కొనితెమ్ము" అనిచెప్ప
            సంత కేగి తేగ సంతసించె!

ఆ.వె:    చిన్ననాటి తనదు శిష్యుండు యొకనికి,
            ప్రీతి పుత్రి నిచ్చి పెండ్లి చేయ;
            వరుడు యతడు గాన,గురువు నేననకను
            చేయవలయు గురువు శిష్య పూజ!


ఆ.వె:    ఆబ్దికదినమునకు, అవసరార్ధమువచ్చె
            శిష్యు డొకడు గురువు చెప్పగానె,
            భోక్త యతడు, గాన భక్తితో తప్పక
            చేయవలయు గురువు, శిష్య పూజ!

ఆ.వె:   శిష్యుడేగురువుకు చెప్పక తనకుతా
            చేయవలయు; గురువు శిష్య పూజ
            గాని, దక్షిణలను గాని యిమ్మనుచును
            కోరడెపుడు;గురువు గొప్ప వాడు!

Wednesday 4 May 2011

శంకరాభ(పూ)రణం - దున్న హరిని జూచి సన్నుతించె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య:  దున్న హరిని జూచి సన్నుతించె   

ఆ.వె:  కావుమనుచు నాడు గజరాజు వేడగా,
          పరుగు పరుగునేగి  ప్రాణములను,
          రక్షజేసి నిలువ  లక్ష్మితో;  తనముం
          దున్న హరిని జూచి సన్నుతించె.

ఆ.వె:  మాఘమాసమందు మహిలోన హరిజూడ,
          తీర్థ యాత్ర కొరకు తిరుపతి జని;
          వేంకటేశురూపు వెలుగుచున్న,  తనముం
          దున్న హరిని జూచి సన్నుతించె.

Tuesday 3 May 2011

అ 'ల్లాడెన్ ' చర్యలతో.... అల్లాడెన్

           లాడెన్ ని అంతమొందించిన  అమెరికా ... నేటి వార్త
                
                       అ 'ల్లాడెన్ ' చర్యలతో.... అల్లాడెన్
 
            కం:  అ 'ల్లాడెన్ ' చర్యలతో
               'అల్లాడెన్ ' పదుల  యేండ్లు అమెరిక, ప్రతి చో
                టల్లా 'డెన్' లను వెదకుచు
              

                అల్లా 'డెన్నునకు 'పంపె  నదిగో యిల్లా! 

Monday 2 May 2011

కప్పకు సంతాన మనిన కంటక.....

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన సమస్యకు నా పూరణ.

       సమస్య: కప్పకు సంతాన మనిన కంటక మాయెన్ 

        కం:   'ఒప్పదు నీకని ' యెందరు
               చెప్పిన; పిల్లలను గని కుచేలుని వలెనే!
               అప్పుల తిప్పలు బడు వెం
               కప్పకు, సంతాన మనిన కంటక మాయెన్!   

Sunday 1 May 2011

శంకరాభ(పూ)రణం : రతికై సోదరిని వేగ రమ్మని ....

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.      

                సమస్య: రతికై సొదరిని వేగ రమ్మని పిలిచెన్
 
     కం:  పతితో గూడి,యట రమా
           పతివ్రతమును చేయుచున్న పద్మావతి, తా
           వెతికిమ్మని, కప్పురహా
           రతికై, సొదరిని వేగ రమ్మని పిలిచెన్.
    కం:  కతిపయ దినముల నుండియు,
          అతిగతి లేదనుచు మిగుల ఆతృతతో, తా
          వెతుకను బోవుచు సతి భా
          రతికై, సోదరిని వేగ రమ్మని పిలిచెన్.